గీ.పంజర నిబద్ధ కీరంబు బయలుగాంచి
యడ్డుకమ్ముల దాటంగ నాశచేయు
నటు బహిర్ని యమంబుల నతకరించి
మన్మనంబు స్వాతంత్ర్య సీమకు జరించు.
గీ. కాన నెవరేమి యనుకొన్న దాన నేమి
గలుగు; గాల మనంతయు; ఇల విశాల;
భావలోకము, క్రమముగా బడయుమార్పు
ఏలహృదయంబు వెలిపుచ్చ నింతయళుకు.
ఈచివరి పద్యభావము భవభూతిని స్మరింప జేయునదికదా! ఈయన వ్రాసికొన్నంతగా భాషా-భావ స్వాతంత్ర్యములు హెచ్చు తీసికొనకుండగనే సంప్రదాయములు పాటించుచు గవిత సాగించుట కాననగును. ప్రాచీన కవి తారీతులపై దండెత్తి యువ్వెత్తుగా నక్షత్ర వీథులలో నెగురు కొదఱవంటి వాడు కాడు రామి రెడ్డిగారు. ఆయన భావ వైభవావేశమునకు సరిపడు భాషాభార ప్రవేశము కలవాడు. ఆంగ్ల పారసీక వాజ్మయములలోని పలుకు బళ్ళు లెస్సగా గుర్తించిన వాడు. సంస్కృత వాజ్మయపు బొలుపులును దెలిసి కొన్నవాడు. సహజముగా సౌజన్యమూర్తి. ఈపయిని, కవిత్వమెటులుండునో భావింపుడు. ఈకవి యభిప్రాయమిది:
వేగు జామున వికసించు విరులయందు
రేకు వెడలించు సంజపూ రెమ్మలందు
కావ్యమున బోలె బఠియింతు కౌతుకమున
ప్రకృతి సామ్రాజ్య పాలన పద్ధతులను.
చటులకల్లోల రసనల సాగరంబు
పవలు రేయి నాలాపించుపాటలందు
అనితర గ్రాహ్యధర్మంబులై చెలంగు
విశ్వసృష్టి ప్రకారముల్ వినుచునుందు.