" మనలో నయముతోడి హాస్యము లేదని మొదలే విన్నవించితిని. నవరసములలో హాస్యమును గూడ జేర్చియున్నను ప్రాచీనుల హాస్యము అసహ్యములను అనభ్యములను వర్ణించుట యందు మాత్రము చరితార్థ మయినది."
" నిజముగా తెనుగు భాషకు మొట్టమొదట హాస్యరసము చవిచూచిన ధీరుడు గురుజాడ అప్పారావుగారే. వారి కన్యాశుల్కమునందున్నంత హాస్యరసనైర్మల్యము తక్కిన యెవరి గ్రంథములందును లేదనుట యతిశయోక్తి కాదు."
తెలుగువంటి బ్రతికియుండు భాషలలో 'ఇవేయపశబ్దములు, ఇవేసుశబ్దములు' అని నికరముగా శాశ్వతముగా నిర్ణయించుటకు బూనుకొనుట వట్టి వెఱ్ఱియని యిన్నాళ్ళకును తెలిసికొనలేకపోవుట మనతప్పు గదా!"
ఇవియెల్ల అనంతకృష్ణశర్మగారి హృదయమునుండి చిందిలిన సందేశ సుధాబిందువులు. 'ప్రబంధకవి' ని గుఱించిన శర్మగారి యాశయము తెలువు గీతములతో నిక నీవ్రాయసము ముగియుచున్నది.
ఇంతవృద్ధు డ వంతయు నెఱిగినావు
తెలిసికో జాలనేమి మా తెలివిలేమి!
అర్థమేకాని పద్యము లల్లనేల?
వీథివీథుల వినువారి వెదకనేల!
అచ్చుతేటల కాశించునట్టి మమ్ము
తాటియాకుల కంతలో దార్ప గలవె?
పూత లేనట్టివ్రాతలో పొలుపు నెఱుగు
కన్ను లెవ్వరికున్న వీ కాలమందు:
భావములు మ్రింగియున్నట్టి బంధములను,
ఆదియంతము లేని నానార్థములును
నోరు తీరుగని పదముల తీరుపులును
విచ్చి చూపేవు గాని నీవెంట దిరిగి
తెలిసికొన మాకు బ్రదుకులో తీరికేది?
మఱచిపోయిన జ్ఞాపించు మార్గమేది?
_____________