పుట:AndhraRachaitaluVol1.djvu/493

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చార్యులకు శర్మగారు స్వీకృతపుత్త్రుడాయెను. ఆకారణమున 'రాళ్ళపల్లి' వీరికి సంక్రమించినది. శర్మగారిగన్న తలిదండ్రులు ధన్యులు. వారికి బుట్టిన నలువురు బిడ్డలలో వీరు ద్వితీయులు.వీరి యన్నగారు గోపాలకృష్ణమాచార్యులును సుప్రసిద్ధులు. అనంతపురపు రెవిన్యూ శాఖలో హుజూరు శిరస్తాదారులుగా పనిచేసి యిపుడు వారు విశ్రాంతివేతనము పుచ్చుకొనుచున్నారు. సంస్కృతాంధ్ర సాహితీ సంపన్నులు. ప్రాచ్య పాశ్చాత్య జ్యోతి శ్శాస్త్రపు సిద్ధాంత ఫలభాగములం దసాధారణ పరిచయము గలవారు. 'భారతి' లో బ్రచురితము లగుచుండు వారి రచనలు తెలుగు వారికి విందులు. 'రాళ్ళపల్లివారి' దట్టి విద్వ దన్వయము. మన శర్మగారు చిన్ననాట పితురంతేవాసియై సంస్కృతాంధ్రములు వ్యాసంగించెను. తరువాత మైసూరు పాఠశాలలో సంస్కృత ప్రాకృత వ్యాకరణములు, అలంకార గ్రంథములు పాఠముచేసినారు. 1912 సం. లో మైసూరు కళాశాలలో బండితపదవీలాభము. నేటికిని వారాపదవిలోనే యున్నారు. సంగీత సాహిత్యములలో శర్మగారుచేయుచున్న సాధనము తెలుగువారి కారాధ్యమైనదని యామోదము ప్రకటించుచు 'వేమన' లోని వారి దివ్యవాచకములు కొన్ని స్మరించెదను.

"......త్యాగరాజు వంటివారి కీర్తినలలో భక్తి యెంతయున్నను వారి గానపాండిత్యము దానిని గప్పి పెట్టినది.పల్లవిదాటులను జూపుద మనిపించునే కాని, వానిని పాడునపుడు ప్రాయికముగ భక్తిని ప్రకటింత మనిపించును."

"......వేమన పద్యము లట్టివి కావు. అతనివి చిటుకలో ముగింపగల చిన్న పలుకులు; అచ్చ తెనుగు పద్యపునడక; గుండు దెబ్బవలె గుఱి తప్పని చిక్కని చెక్కినమాటలు. నోరుగల తెలుగువారందఱును నేర్వవచ్చును."

"బాలవ్యాకరణము, అప్ప కవీయము మొదలగువాని దెబ్బలకు వేమన పద్యము లెంత నులినులి యైనవో చెప్పితీఱదు."