యడకువతో దన పాండితీ ప్రతిభలు దాచుకొనుచున్న పండితుడు ప్రభాకరశాస్త్రి - ఈ వినయవాదము వినుడు.
"......అఱవము వాడుకభాష తప్ప గ్రాంథిక భాష నాకురాదు. ఇంగ్లీషు అసలేరాదు. చిరశ్రవణమున నేదో గుఱికి గొంతయెడముగా నర్థమగుట గాని యందు నా కేమాత్రము నెఱుకలేదు. తెలుగులో నేదోకొంత తంటాలు పడితి ననుట తథ్యము. ఆంధ్రవాజ్మయ సౌధనిర్మాణ కర్మకారులలో నేను నొకడ నగుదు ననుకొని కొన్నాళ్లు కూలిపనిచేసి మట్టి ముద్దలు మోసితిని. చేతులు కడిగికొను దశలో నిప్పుడున్నాను - నా యాధ్యాత్మిక పరిశ్రమమునకు సంబంధించిన విషయము లితరులకు దెలియవలసినవి గావు..........తెలుగు నేను నేర్చిన నాలుగు ముక్కలకు పూజ్యులు, గురువర్యులు నగు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రిగారి గురుత్వానుగ్రహము ప్రధానకారణము..........వాజ్మయవిషయమున నాపై గొన్ని యప్పులున్నవి. అవి యెప్పుడో తీర్పవలసినవి. కాని పెక్కేండ్లనుండి యుపేక్షతోనే యుంటిని. ఈశ్వరానుగ్రహమున్న నందు గొన్నింటినేని యిక దీర్చుకొనగలుగుదు నేమో!"
'భారతి' ప్రమాధి కార్తికము.
నిరాడంబరమైన యిట్టిబ్రతుకు ఆర్ధికముగా ముందునకు సాగకపోయినను, ఆధ్యాత్మికముగా నందన వనము వంటిది. 'వేటూరి' వారికి నతీర్థ్యులగు విశ్వనాథ సత్యనారాయణగారు 'త్రిశూలము' పీఠికలో బ్రభాకరశాస్త్రిగారి యుపేక్ష కిటులు చింతించినారు.
వేటురి వారి వ్యాఖ్యలును బీఠికలుం దెలుగుం బొలంతికిన్
బేటులురేగు గందవొడి వెట్టిన పూతలు; నంతయయ్యు వా
రేటికొ వట్టి పేదతనమే భజయింతురు, నెంతయయ్యు నో
నాటకు నెక్కుటో! తెలుగునాటికి నాటికి నాటి కక్కటా!