Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/458

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వెంకటగిరి సంస్థానాధిపతుల ప్రోత్సాహముచే "సంస్కృత కవిజీవితములు" శ్రీశాస్త్రులుగారు తెనుగులో రచించి వెలువరించిరి. ఈరెండు గ్రంథములు సూర్యనారాయణ శాస్త్రులుగారి యశోలతకు బ్రాకులు.


పింగళి సూరనార్యుని 'కళాపూర్ణోదయము' ముద్రణదోషములతోను, విరుద్ధపాఠభేదములతోను నుండి యర్ధావగతికి గష్ట పెట్టుచున్నదని శాస్త్రులుగారు పరిశ్రమించి, పాఠభేదములు గుర్తించి సరిపఱిచి భావప్రకాశిక యను టీకతో, ఆమహాకావ్యమును లెస్సయగు తీరులోనికి గొనితెచ్చిరి. ఇది ముద్రింపించిన వారు పీఠికాపురాధీశ్వరులు. మల్లాదివారి పాఠములు కొన్ని ససియైనవి కావని తరువాత విమర్శనములు తలసూపినవి. ముఖేముఖే సరస్వతీ! శాస్త్రులుగారి వాజ్మయ వ్యవసాయము నిస్సామాన్య మైనదికాని, అందఱకు నందునది కాదు. ప్రాచ్య భాషాపండితులలో నిట్టి ప్రగాడ మైన యభినివేశము గలవారు పెక్కురు లేరు ; ఇట్టి లోకజ్ఞతాసంపత్తి గలవారును దక్కువగా నుందురు. వీరు ఆంధ్రవిశ్వకళా పరిషత్తు 'సెనేటూకడమిక్కుకౌన్సిలు, ఓరియంటల్ ఫాకల్టీ' మొదలగువానిలో సభ్యత నంది పండితులకు మన సంస్కృతాంధ్రములకు సంబంధించిన తీరుమానములు తెచ్చుచు నందు గొన్నింటిని సఫలము కావించి యున్నారని ప్రముఖులు చెప్పు చున్నారు. ఇది శాస్త్రులుగారి లోకజ్ఞతకును గుఱుతు. 1927 సం.లో శాస్త్రిగారి యధ్యక్షతనంది "ఉపాధ్యాయ పండిత పరిషత్తు" నేడు తెలుగునేలలో నలుమూలల బ్రాకి దొరతనము వారిచే గొన్ని యుపయోగములు చేయించుకొన్నది.


శాస్త్రులుగారి 'సంస్కృత భాషారచనలు' వారి షష్టిపూర్తి సన్మానసంచిక చివర బ్రచురితములయినవి. అవిచూచినచో గీర్వాణవాణిలో వారికి గల నైశిత్యము నైపుణి వెల్లడి కాగలవు.