Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/457

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారికిగల శ్రద్ధానియమములు చక్కనివి. మహా పండితులు చర్ల బ్రహ్మయ్యశాస్త్రిగారి సన్నిధిని వ్యాకరణశాస్త్రాధ్యయనము చేసి, తెనుగులు స్వయంకృషిని జూచి యుభయభాషా విశారదులై 1900 లో అమలాపురము హైస్కూలున నుపాధ్యాయులుగా బ్రవేశించిరి. అది నాలుగేండ్లయిన తర్వాత ఆంధ్రసాహిత్యపరిషత్తు వ్యవహర్తగా నొకయేడుద్యోగ నిర్వహణము. 1915 లో, రాజమండ్రి ట్రైనింగుకాలేజిలో నధ్యాపకత. ఆపదవి యొక వత్సరము. పదపడి, అనంతపురము కళాశాలలో మూడేండ్లు. మరల రాజమహేంద్రవరము ఆర్ట్సు కాలేజిలో 1919 - 1931 నడుమ పండ్రెండు వత్సరములు పండితస్థానము. అక్కడినుండి ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాలలో పదియేండ్లపాటు విద్వత్పదవి. మొత్తముమీద నాలుగుదశాబ్దులు పఠనపాఠనములలో శాస్త్రులుగా రాఱితేఱిరి. ఈలోపుననే వీరు కొన్ని గౌరవోద్యోగములు నిర్వహించిరి. వేంకటగిరి రాజావారి సంస్థాన కవితాపదవి 1909 - 1919 మధ్య. జటప్రోలు సంస్థానవిద్వత్ స్థానము 1910 - 1917 నడుమ. నారయ్యప్పారావు సంస్థాన విద్వత్కవిత్వ పట్టము 1919 - 1926 నడుమ. ఈవిధముగా సంస్థానకవులై యుపాధ్యాయులై యంతేవాసులకెందఱకో విద్యాభిక్ష పెట్టియుండుటచే సూర్యనారాయణ శాస్త్రిగారికి సుస్థిరమైన యశస్సు చేకుఱినది. దీనికిదోడు గ్రంథరచన . శాస్త్రిగా రనువాదములేకాక స్వతంత్రరచనలు కూడగావించిరి. వారి కృతులన్నియు బాఠ్యములుగా నిర్ణీతములు. 'సంస్కృత వాజ్మయచరిత్ర' వీరిది శాశ్వతముగా నుండ దగినగ్రంథము. ఒకదశాబ్దము చేసిన నిరంతరకృషి ఫలము. వైదికవాజ్మయము , లౌకికవాజ్మయమునని రెండుభాగములుగా నీ గ్రంథము విభజింపబడి వ్రాయబడినది. ఆంగ్లములో నీవఱకు సంస్కృతవాజ్మయ చరిత్రమున గలపొరపాటులు పేరుకొని, మనోహరము నిర్గుష్టము నగు ఫక్కిలో వీ రీగ్రంథము సంధానించిరి.