పుట:AndhraRachaitaluVol1.djvu/453

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ తీరున విద్వాంసుడై కావ్యరచనము గావించిన కట్టమంచి కవి వంగడము సాహిత్యాభిరుచి కొన్నితరములనుండి కలిగి వచ్చు చున్నది. దానికి దారకాణగా మనరామలింగారెడ్డి యపుడపుడు వ్రాసిన కృతి పీఠికలలోని కొన్ని బంతులు గమనింతము.


"ఒకానొకప్పుడు శిష్యులైన కుప్పనయ్యం గార్లు బురదలో దిగబడి నడవజాలక, గనిమమీద బోవుచుండిన రామలింగారెడ్డిగారిని [మనరెడ్డి ముత్తాత] వచ్చి చేయూత నిమ్మని సంస్కృతములో నాక్రోశించిరి. ఆకూత నవ్యాకరణముగా లేనందున, దానిని దిద్ది పునశ్చరణము చేసిననేకాని రానని కోపించుకొనిరట. ఈయితిహాసము కుప్పనయ్యం గారే యొకానొకప్పుడు క్లాసులో జెప్పిరి. ప్రాణాలకైనను వ్యాకరణము హెచ్చేమో యాకాలపు గురువునకు! ఈయన మహాకవి యని మాబంధువులలో గొప్పప్రసిద్ధి. నేనుపుట్టిన లగ్నమును, మఱికొన్ని చిహ్నములును, భావిపాండిత్య సూచకములని కుప్పనయ్యంగార్లు వారిపేరు నాకు బెట్టిరి."

                             *


"కవిత్వము మహాసాహస కార్యమని నాతండ్రికి భయము. ఒకవిధముగా జూచిన నిజమే! కాని, వారి కారణములు వేఱు. విషగణములు పడి యెవరికేచేటు వాటిల్లునో యని వెఱుపు పెద్ద. తెనుగులో నాకుండు పాటవము జూచి వీడెప్పుడు కవిత్వరచనకు బ్రారంభించి నాశనమగునో యని దిగులు చెందుచుండును. సాక్షాత్తు తన కంఠస్వరముతోనే తాను జదివెడు మాడ్కినే భారతమును నేను జదువునప్పుడు పరమానందమును, నీతుంటరి కవిత్వమును మొదలువెట్టి యిల్లు కూల్చునో యనుసంశయమును జనిపోవువఱకు దాల్చియుండెను. కవిత్వ మనగా మరణయోగములలో నొకటి!"