మ. పది దోసిళ్ళకు నొక్క దోసిలి త్రపాపర్యంతమై,సేసబ్రా
లొదిగించెన్ జనకాత్మజాత పతిపై నొయ్యారపున్ లజ్జయున్
జదురౌ తొల్తటి మెట్టు డిగ్గుచుఁ ద్రపాశైథిల్య మార్గంబునన్
బెద రావేళకుఁ దీరినట్టి కనులన్ వీక్షించుచున్ రాఘవున్.
ఆ॥వె. చంద్ర రేఖపైని సన్నని తెలిమొయి
ళ్లాడినట్లు ముత్తియమ్ములాడెఁ
దల్లిమేనిపైని నల్లనియాకాశ
మట్లు రామచంద్రుఁ డందె యుండ.
ఉ. అల్ల వివాహమండపమునై చనుచోటికిఁ జిత్ర చిత్రముల్
కొల్లలుగాఁగ వచ్చె వెలుఁగుల్ వెసఁ బెండిలివారలెల్ల ద్వా
ర్వేల్లితదృష్టులై చినుకు వెక్కసమౌ చిఱు జల్లువానలో
ఫుల్లవిచిత్రవర్ణములు పూవులు చూచిరి లంబమాలలన్.
క. ప్రతి చైత్త్రశుద్ధ నవమికి
వితతంబుగఁ దెలుఁగునేల విరిసెడుజల్లుల్
సితముక్తా సదృశంబులు
ప్రతనులు తలఁబ్రాలవేళ వచ్చెఁ జిటపటల్.
సత్యనారాయణగారి కిన్నెరసాని పాటలు తెలుఁగునాటఁ బ్రాకినవి. సభలలో నాయన యుపన్యాసము చెప్పి యూరకున్న తరువాతనో నట్ట నడుమనో సభ్యులలో నెవరో లేచి కిన్నెరసాని పాటలు పాడవలయునని శాసింతురు. ఆయన వీలుగా నున్నచోఁ బాడుదురు. లేనిచో కస్సుమందురు. 'విశ్వనాథ' కవి యుపన్యాసవాణి పటుత్వము కలది. అధ్యక్ష్యము వహించుటకుఁ గగిన బిగువు వారిలో నున్నది. "విప్రుని యలుకయుఁ దృణహు తాశనంబు దీర్ఘమగునె!" ఈయెఱుక కలవానికి సత్యనారాయణగారు వెన్న వంటిహృదయము కలవారు.