పుట:AndhraRachaitaluVol1.djvu/446

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రస్తుతము వారియుద్యోగము బెజవాడ కాలేజీయందు. ఇదివరలో రెండు మూఁడు సారులు స్వాతంత్ర్యవాంఛా ప్రభంజనము రేగి కొన్ని యుద్యోగముల నూదివైచినది. మహోదారము, స్వతంత్రమునైన హృదయముగల సత్యనారాయణగారు ఎమ్. ఏ. పట్టభద్రులయినా రన్న విషయము కొందఱు సనాతను లెఱుఁగరు. సభావేదిక మీఁద నాయన మాటాడునపుడు సాధారణముగా నాంగ్లవాసన వేయనీయరు. శుద్ధ శ్రౌతి - కర్మిష్ఠి లోకజ్ఞత గలిగి సంభాషించుచుండెనా యనుకొందుము. సత్యనారాయణగారు శ్రౌతధర్మములు పెక్కులు తెలిసికొనిరి. స్మార్తము పాఠము జెసిరనియు వినుకలి. ఇన్ని యర్హతలు గలవా రాధునికులలో "ద్విత్రాఃపంచషావా."


నన్నయభట్టారకుని యక్షరాక్షరము సత్యనారాయణగారు పరిశీలించి "ప్రసన్న కథాకలితార్థయుక్తి" - "నానారుచిరార్థసూక్తినిధి" అనువాని నాధారముగాఁ దీసికొని 'భారతి' లో వెలువరించిన యమోఘవ్యాసములు వీరి లోఁతుగుండెకు సూచికలు. 'అమృతశర్మిష్ఠ' యని పేరుపెట్టి శర్మిష్ఠాయయాతి చరిత్రము వీరు సంస్కృతభాషలో నాటకముగా సంతరించిరి. వేయిపడగలుగా విప్పారుకొన్న సత్యనారాయణ గారి ప్రతిభావ్యుత్పత్తులను గుర్తించి 'కవిసామ్రాట్' బిరుదము నిచ్చి మెచ్చుటయు, గజారోహణోత్సవము గావించుటయుఁ దెనుఁగుభూమి చేసిన ఘనకార్యములు !