Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/435

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వనాథ సత్యనారాయణ

1893


వెలనాఁటి శాఖీయులు. తండ్రి: శోభనాద్రి. జన్మస్థానము: నందమూరు. నివాసము: బెజవాడ. జననము: 1893 సం. గ్రంథములు: నవలలు: 1. వేయిపడగలు 2. చెలియలికట్ట 3. మాబాబు 4. ఏకవీర 5. జేబుదొంగలు 6. హాహాహూహూ 7. స్వర్గానికినిచ్చెనమెట్లు 8. ధర్మచక్రము-ఇత్యాదులు. నాటకములు: 1. నర్తనశాల. 2. సౌప్తిక ప్రళయము 3. అనార్కలి 4. వేనరాజు 5. త్రిశూలము 6. కళింగరాజ్యము-ఇత్యాదులు. పద్యకావ్యములు: 1. ఆంధ్ర ప్రశస్తి 2. ఆంధ్ర పౌరుషము 3. గిరికుమారుని ప్రేమగీతాలు 4. వరలక్ష్మీ త్రిశతి 5. శృంగారవీధి 6. విశ్వేశ్వర శతకము 7. శశిదూతము 8. ఋతుసంహారము 9. శ్రీమద్రామాయణ కల్పవృక్షము మున్నగునవి. పాటలు: 1. కిన్నెరసాని పాటలు. కోకిలమ్మ పెండ్లి, ఖండ కావ్యములు, కథలు, వ్యాసములు మున్నగునవి.


శ్రీవిశ్వనాధ సత్యనారాయణగారిని నవలారచయిత లెఱుఁగుదురు. నాటికాకర్త లెఱుఁగుదురు. ప్రబంధకవు లెఱుఁగుదురు. పత్త్రికాసంపాదకు లెఱుఁగుదురు. ఉపన్యాసకు లెఱుఁగుదురు. విమర్శకు లెఱుఁగుదురు, సనాతను లెఱుఁగుదురు. సంస్కర్త లెఱుఁగుదురు.


సత్యనారాయణగారు నేఁటి యాంధ్ర సారస్వతమున విశిష్టస్థానము నాక్రమించిన రచయిత. వీరికి నవీన వాఙ్మయముపై నెంత యభిమానమో, ప్రాచీన సాహిత్యముతో నంత యభినివేశము. వీరి కవిత్వములో నాముక్తమాల్యదా కాఠిన్య ముండును; పెద్దనగారి ముద్దు పలుకుల పొందికయు నుండును. ప్రాయికరచన గ్రాంథికము, వ్యావహారికము నిషిద్ధము కాదు. నవ్యకవుల ఖండకావ్యముల ధోరణి చక్కగా సాగింతురు. గేయములు హాయిగా వ్రాయుదురు. శతకములు వ్రాసిరి. నేఁడు రామాయణము మహాప్రబంధముగా రచించుచున్నారు.