పుట:AndhraRachaitaluVol1.djvu/418

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పండితులు శ్రీ దువ్వూరి వేంకటరమణశాస్త్రిగారు వజ్ఝులవారి యనుయాయులు. ఈ తీరున నెందరో మనశాస్త్రులుగారి యాచార్యకముచే విద్వత్పదవులలో నున్నారు.


వీరు చెన్నపురి విశ్వవిద్యాలయాంధ్ర భాషాపరిశోధకసభ్యులు, ఆంధ్ర విశ్వకళా పరిషదాంధ్ర పరిశోధకపండితులు నై ప్రతిష్ఠ సంపాదించినారు. విశ్వకళాపరిషత్తు నుండి విశ్రాంతితీసికొని ప్రస్తుతము వ్యాకరణ సమగ్రతా రచనకు బూనుకొని యున్నారు.


ఈయన కాంగ్లభాషాప్రవేశము లేక పోయినను, పాశ్చాత్య విమర్శన విధానములు తెలియును. వసుచరిత్ర విమర్శనములో నిది తెల్లము కాగలదు. వీరివ్యాకరణ శాస్త్రపరిశోధనము నేటి భాషాతత్త్వశాస్త్రము ననుసరించియుండును. కవిత్వము కూడ వ్రాయగలనని ' వీరసింహుడు ' కావ్యముగా గట్టి చూపిరి. శ్రీశాస్త్రిగారి పితామహభ్రాతృసుతుడైన చింతామణిశాస్త్రి యుపదేశమహత్త్వము, మహామహోపాధ్యాయ తాతా సుబ్బారాయశాస్త్రిగారి యుపదేశ మహత్త్వము వీరిలోబడి ఫలవంతము లైనవి. తెలుగు వ్యాకరణముల కొరకే యవతరించిన విచక్షనులు సీతారామస్వామి శాస్త్రిగారు !