పుట:AndhraRachaitaluVol1.djvu/417

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొలిసంపుటము ఆంధ్రవిశ్వవిద్యాలయము వెలువరిచినది. ఇది సమగ్రముగా వ్రాయబడినచో శాస్త్రిగారి యభిప్రాయ వ్యక్తీకరణమునకు నిలువుటద్దము వంటిది కాగలదు. వీరి యభిప్రాయ సామ్రాజ్యమున నన్నయభట్టారకునకు బ్రాజ్యగౌరవమున్నది. అతని శబ్దశాసన బిరుద పౌర్వాపర్య విషయమున బ్రచురించిన వీరి సిద్ధాంతములు మెచ్చుకోలు పడయదగినవి.


బాలసరస్వతీయమునకు, అధర్వణకారికావళికి, హరిశ్చంద్రనలోపాఖ్యానమునకు వీరు వ్రాసిన పీఠిఅక్లు విపుల విషయములను జర్చించుచున్నయవి. వీరి యొక్కొక పీఠిక యొక్కొక గ్రంథము. సమాజ సారస్వతమునగూడ గొన్నాళ్లు వీరు పరిశ్రమము సలిపిరి. " స్త్రీవివాహ వయోనియమము " దీనికి సాక్షి. " రజస్వలానంతర వివాహమే ధర్మశాస్త్రముచే నుత్తమకోటి నధిరోహించుచున్నది. ప్రకృతమున ఋతుమతీ వివాహ మంతరించిన మాత్రమున నది యావత్కల్పమనుత యసంగతము. శారదాబిల్లు క్షేమకరము." ఇది సీతారామశాస్త్రిగారి యాశయము. సహజముగా నీయనకు వైదిక కర్మనిష్ఠ తక్కువ. కర్మిష్ఠులనిన గౌరవము లేనివారు మాత్రము కారు. వ్యావహారికవాదము నిష్టపడరు. కాని, వ్యావహారికముపై కత్తినూరువారి నొకపట్టుపట్టును. గిడుగువారి ' ప్రాదెనుగుకమ్మ ' పై ' అంపగమి ' పరపిన పండితుడీయనయే.


పెక్కేండ్లు విజయనగర సంస్కృతకళాశాలాంధ్ర పండిత పదవి నిర్వహించిరి. అప్పుడే వీరిమూలమున బెద్దశిష్యులు బయటబడిరి. స్వర్గీయులు దూసి రామమూర్తి శాస్త్రిగారు వీరి శిష్యులు. ఆయన రచించిన "బాలవ్యాకరణ సారస్యసర్వస్వపేటిక " లో " వజ్ఝుల వారిశిష్యు " డన్న విషయము పుట పుటకు దట్టుచుండును. విజయనగరసంస్కృత కళాశాలలోనే యుద్యోగించి విశ్రాంతి గయికొనుచున్న ఆకొండి వేంకటశాస్త్రిగారికి వీరు గురువులు. ఆంధ్రవిశ్వ విద్యాలయముచే నే డాదరింపబడుచున్న