ఉమర్ అలీషా కవి
1885 - 1945
ఇస్లాం మతస్థులు. తండ్రి: మొహియద్దీన్. నివాసము: పిఠాపురము. పుట్టుక: 1885 సం. నిర్యాణము: 23 జనవరి 1945 సం|| గ్రంథములు: పద్మావతి, మణిమాల, స్వర్గమాత, విషాదసౌందర్యము, మదాలస, బ్రహ్మవిద్యావిలాసము, శాంత, చంద్రగుప్త, విచిత్ర బిల్హణీయము, దానవవధ, సూఫీ వేదాంతదర్శము, ఇలాజుల్ గుల్భా, ముసద్దాస్ ఆలి, ఉరుపత్తూరు చక్రవర్తి, శ్రీమద్వాల్మీకి రామాయణము, మున్నగునవి.
అలీషాకవి మాతృభాష ఉరుదు. మతము ఇస్లాము. ఇట్టివాడు తెలుగుబాసలో దిట్టమైన సాహిత్యము కలిగించుకొని కవిత్వము గట్టి పేరు సంపాదించుట మెచ్చుకోదగిన సంగతి. ఈయన తెనుగులో నొకటి రెండు పుస్తకములు కాదు, ఏబది గ్రంథములవఱకు సంతరించి రనగా నతిశయోక్తముకాదు. కవితా ధోరణియా సులభరమణీయమైనది. భావనావేశము సరేసరి. గ్రంథరచనా విషయ మటులుంచి, యీయన తెనుగులో నుపన్యసించుట విన్న వారున్నచో నడుగవచ్చును అచ్ఛమైన మధువాహిని యోడిగిలునటులుండెడిది. భాషలో నిర్దుష్టత - పలుకుబడిలో గ్రొత్తబెడగు, ధారాళత వీరియుపన్యాసమునకు మెఱుగులు తెచ్చినవి. మాటనేరుపు, వ్రాతతీరుపు సరితూకముగా నలవడిన యీ కవి ధన్యుడు. తెలుగుబాస కడుపున బుట్టిపెరిగినవారికే దిక్కు లేదు. ఈయన యంతసొగసుగా గవిత కట్టెను! అలీషాకవి తండ్రి అరబ్బీ పారశీక సంస్కృతములు చదువుకొనెను. ఒక ఆధ్యాత్మిక విద్యాపీఠమునకు వీరి కుటుంబము వారిది యాచార్యత్వము. తండ్రి సాహచర్యమునను, మఱికొందఱు గురువుల సేవ వలనను మన ప్రకృత కవి అరబ్బీ పారశీకములు, సంస్కృతాంధ్రములు, ఆంగ్లము తగిన తీరున జదువుకొనెను. ఈ చదువునకు సహజమైన కవితాధోరణి తోడు. పదునాఱవ