నిరంజనకవి ఆంధ్ర కర్నాట మహారాష్ట్రాదిదేశములు పర్యటించి శిల్పగ్రంధము లెన్నో సంగ్రహించెను. ఇతడు విశ్వబ్రాహ్మణ సంఘమునకు, సారస్వతమునకు శ్రద్ధమెయి సేవచేసికొని తరించెను. కవిత్వము జానుతెనుగులో బహుమృదు మధురముగ జెప్పి మహాకవులను మెప్పించెను. మొత్తముమీద నిరంజనకవి వ్యుత్పత్తిని దాటిన ప్రతిభ కలవాడని చెప్పనొప్పును. అచ్చుపడిన యతని 'బ్రహ్మానంద లీలలు' నాటకము నుండి మూడు పద్యములిచ్చెదను.
మ. తమ మాయామహిమన్ జనించునవి, కాంతారాంతరావాను లు
త్తమగార్హస్థ్యజనుల్ భజించునవి, యద్వైతా మృతంబున్ సమ
స్తమతాధ్వంబుల గ్రుమ్మరించునవి, సిద్ధశ్రీ మనోమంగళా
డ్యము లైనట్టివి దన్పుగాత! మిము బ్రహ్మానంద లీలావిధుల్.
ఉ. పాటిదొఱంగి వాసనలు పైబడ సంసృతి గ్రుంకు నీప్రజా
కోటి కనంతమోద మొనగూర్పగ మోక్షకవాట పాటవో
ద్ఘాటన దివ్యరంగము బ్రదర్శనముం బొనరించు నాజగ
న్నాటక కర్త యీకథకు నాయకు డౌట యెఱుంగవే సఖీ!
గీ. ప్రకృతి చెలువ వెంట బ్రాకులాడక యున్న
జగము బ్రహ్మమెట్లు జరుపనేర్చు ?
దానగాదె లోకతత్పర క్రీడమై
బాలుడౌట మునులవజ్జ గనుట.
______________