సభలలో దఱచు చూచి యుందుము. ముదిమిచే దటస్థించిన చిన్న యొదుగుగల మధుర కంఠస్వరముతో నీమహారాజు తెలుగుభాషలో నభిభాషించునపుడు తెలియనివా రేమనుకొందురు? లక్షల కొలది రాబడి వచ్చు సంస్థానమునకు బ్రభువు లని యూహింపగలరా? కాలుక్రింద బెట్టనక్కఱలేని రాజ్యాధిపతి యని తలంపగలరా? ఏమనుకొందురు? చక్కగా నుపన్యసింపగల యెవరో వృద్ధవిద్వత్కవి యని మాత్రము తెలిసికొన గలుగుదురు.
శ్రీ విక్రమదేవ వర్మగారు ఆంధ్రముననే కాదు, ఆంగ్లమునను మృదువుగా నుపన్యసింప గలుగుదురు. ఉత్కలభాషలో వీరికి మంచి ప్రవేశ మున్నదని చెప్పుట ఆ భాషలో "రాధామాధవ నాటకము" సంఘటించినారని తెలియుచున్నది. సంస్కృతవాజ్మయములో వీరికి ధారాళమైన సాహిత్య మున్నది. ఆభాషలో రచించిన వీరి శ్లోకములు చక్కని ధోరణిలో సాగినవి.
శ్లో. సంసృత్య పారజలధే స్తరణైక పోతౌ
పాపాంధకార పటలీదివసాధినాధౌ
భక్తాళినిత్య సుఖకైరవ షండసోమౌ
చైతన్య దేవచరణౌ శరణం ప్రపధ్యే
శ్లో. సంసార పాశబద్ధానాం ప్రాణినా మతిదు:ఖినాం
ముకుందనామ వర్ణాళి స్మరణం ముక్తిసాధనం.
వీరు సంగీతకళలో గూడ బరిచితిగలవారు. జ్యోతిషము తెలియును. నాట్యము నెఱుగుదురు. ఇట్టి విజ్ఞతలు వారిలో నున్న వనుటకు రచనలు నిదర్శనములు. కావ్యరచనయందును, కథా గ్రథనమునందును వీరికి మంచిచాతుర్యము కలదు. పెక్కు గ్రంథములు వ్రాయలేదు కానివ్రాసిన నిర్దష్టముగ నుండును. వీరి కవితాశయ్యలో శుచిత్వము హెచ్చు. రుచి కొంచెము తక్కువ. వీరి మానవతీచరిత్రము, శ్రీనివాస