బిరుద మొసగిరి. వేయి బిరుదము లిచ్చి నాలుగువేల సన్మానములు చేయనిండు. వేంకటశేషశాస్త్రిగారికిగల 'శివభారతకవి' యన్న బిరుదముతో నవిసరిరావు. రాజశేఖరకవిగారికున్న 'ప్రతాపసింహచరిత్ర కవి' యను బిరుదముతో నవి సరిరావు.
శేషశాస్త్రిగారు జన్మభూమిలోనుండి పోతనవలె హాలికవృత్తి జేసికొనుచు, వీలుపడినపుడు పురములకుబోయి యవధానములు ప్రదర్శించుచు భారతి, మల్లికామారుతము, పుష్పబాణవిలాసము తెలుగు పఱిచిరి. 'హరికథలు' రచించి తమ అన్నగారు వేంకటసుబ్బాశాస్త్రులు గారిచే నాపరిసరమున నచట నచట గాలక్షేపములు చేయించిరని వినుకలి.
1930 లో నెమ్మళ్ళదిన్నె విడిచి ప్రొద్దుటూరు చేరుకొని 'కన్యాకాపరమేశ్వరీ సంస్కృతపాఠశాలలో నధ్యాపకత నిర్వహించుచు, 'బ్రహ్మనందినీ' పత్రికకు బ్రచ్ఛన్న సంపాదకత సాగించుచు గాలము గడపిరి. 1932 లో, ప్రొద్దుటూరు 'మ్యునిసిపల్ హైస్కూలు' న ఆంధ్రోపాధ్యాయులుగా బ్రవేశించి నేటికిని ఆపదవియందే యుండిరి.
వాస్తుజంత్రి, ఔర్మిళాలక్ష్మణము, అనర్ఘరాఘవాంధ్రీకరణము మున్నగు రచనలు రచించిరని తెలియవచ్చెను. కొన్ని యసమగ్రములు, కొన్నియప్రకటితములు, కొన్ని యుత్పన్నములును ఈనాటికి సంపూర్ణముగ రచితమై చక్కగ బ్రచురితమైన గ్రంథ మొక శివభారతము మాత్రము. గడియారము వేంకట శేషశాస్త్రిగారి కీర్తి తెలుగున గలకాలము నిఱుపుట కీ కృతి చాలును. ఇటీవల వారు రచించుచున్న 'శ్రీకృష్ణదేవరాయ చరిత్ర' పూర్తియై వెలువడినచో నది తెలుగు బాసకు దొడవుపై తొడవు.
_______________