తల్లిఱెక్కల ప్రోవు దలగని సాంభాజి
భావి జీవితనౌక భంగపఱచి
కమియమాగినపండు గర్భపిండ మగల్చి
కఱకు గాకలదాలి గ్రాగ జేసి
ఇంత ప్రళయంబు గలిగింప నేలనయ్య
కనికరము లేదొ, పాపసంకటము రాదొ,
కన్న తండ్రివికాదొ, యక్కసముపోదొ,
వలదు వలదయ్య పచ్చని యిలు రగుల్ప. [ప్రథమశ్వాసము]
జీజియాబాయి చంటిబిడ్డ శివాజి కుగ్గుబాలతో, జోలపాటతో, వీరచరితములు నూఱిపోసినది. దాదోజీ గురుత్వమున శివాజి చక్కగ జదువను వ్రాయను నేర్చి, అంకగణితము నెఱిగి రాజ్యాంగవిధానముల మెలకువలు తెలిసికొనెను. మాతౄపదేశము కరడుగట్టిన శివాజికి మతముమీద - దేశముమీద నున్నంత యభిమానము, పట్టుదల శాస్త్రములమీద నుండకపోవుట వింతగాదు-
మ. కలతం జెందెడు నాత్మదేశమతముల్ గాపాడ, శస్త్రాస్త్ర వి
ద్యలు జాణక్య తవంబులున్ జదువు విద్వాంసుల్, మహారాష్ట్ర వీ
రులు వేదాంగము లెత్తి యర్థముల మార్పుం దీర్పు చర్చించు తా
తల తాటాకుల మీది గంటముల వ్రాతల్ గోతలున్ మెత్తురే!
ఈ నాలుగు పంక్తుల పద్యములోను గవివారికి దేశస్వాతంత్ర్య కాంక్ష యెంత యున్నదో వెల్లడియగుచున్నది. వేదములు, వేదాంగములు, కళలు అన్నియు నొకమెట్టు - ఆత్మ దేశ సంరక్షణ మొకమెట్టు. శేషశాస్త్రిగా రీఘట్టమున శివాజీయయి వ్రాసియుండిరి.
పునహాలో శివాజీకి దాదోజి రాజ్యాంగపద్ధతులు శిక్షించినాడు. ఆ శిక్షణక్రమ మిటులున్నది: