పుట:AndhraRachaitaluVol1.djvu/377

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భవాని కోవెల కేగి చేసిన విన్నపము - ఇవి బహు రసవద్ఘట్టములు, జాతీయసూక్తులు వాడుటలో జిక్కనిపలుకు లేఱికొని పొదుగుటలో, వైపువాటము లెఱిగి పద్యములు నడపుటలో, నడుమనడుమ బానకములో మిరియపు బలుకులవలె సంస్కృతపదములు సంధానించుటలో, నాటి, నేటి రాజ్యాంగవిధానముల సమన్వయ పఱచుటలో, ఔచితి పాటించుటలో శివభారతకవికి గల జగజాణతనము మన తెనుగునేలలో నీనాడు పలుచగ నున్నది. ఉభయ స్కంధముల బలిమితో సారస్వతసాగరము లోతులు ముట్టి రసామృతకలశమును జేపట్టిన మహాకవులలో శేషశాస్త్రిగారు నొక మహాకవి యని, శివభారతము జెండా నెగురవైచినది. కొన్ని మచ్చులు.


లుకజీ తన్ను జంపవచ్చినపుడు కూతురు జీజియా యనుచున్న మాటలు:


ఉ. కెవ్వున హుంకరించి యడికించెద, వాయుధ మెత్తనుంటి వీ

వెవ్వరిపైన ? నీయెడద కింత వివేకము చాలదయ్యెనే ?

గువ్వలుగూడ గాన్పులను గూరిమి బెంచు జగంబునందు నీ

వెవ్వడవయ్య ? యాదరణ కెక్కరె యల్లుడు నాడుబిడ్డయున్.


చ. కనికర మింతలేని కొటికాడపు నన్నిటు పెంచనేల? పు

ట్టినయపుడే గళ మ్మటమటించిన బోవదె ? వెంటనంటి యి

య్యనుపున వేటలాడ మనసయ్యెనె? కన్న నిసుంగుమ్రింగు వ

ర్తన మది సర్పజాతికి గదా ! యొకమానపు డిట్లు సేయునే?


సీ. అనురాగ నిలయ నాజనని మాల్యాదేవి

కడుపులో గార్చిచ్చు గనలజేసి

కన్నీటిబుగ్గ బుగ్గలజాఱ గుమిలిపో

యెడు నన్న 'యక్లోజి' యెడద ద్రుంచి