పుట:AndhraRachaitaluVol1.djvu/341

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాస్త్రినిగూర్చి కింకవీంద్రఘటాపంచాననుడు చెళ్ళపిళ్ళకవి "పేరి కతండు శిష్యుడని పేర్కొన కొప్పక పోదుగాని కై, వారము గాదు నాకతడు వారక దేశికువంటివాడె......" యని మెచ్చుకొనెను. సర్వధా సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ధన్యులు. పుత్రసంతానములేని కొఱత వారి విషయములో గొఱతయేగాదు. "పుత్రాత్సద్గతి రితిచేత్తదపి ప్రాయోస్తియుక్త్యనహమ్" అను శాంకరసూక్తి నెఱిగిన వారి కటు లనుపించదు. సంగీతసాహిత్య తత్త్వవేత్త యగు శ్రీ హరి నాగభూషణముగారు వీరి యంతేవాసి. వారేకాదు, మఱియెందఱో శాస్త్రిగారి సేవాభాగ్యము వడసి, పండితులై కవులై పేరుపెంపులు గాంచిరి.


సుబ్రహ్మణ్య శాస్త్రిగా రవధాన సందర్భములలో గావించిన దేవీస్తవము లివి పరికించినచో , ఆయన యెన్ని సంస్థానములలో సత్కారములు గాంచెనో వ్యక్తమగును.


సీ. ఏదేవి దయ జయమిప్పించె సత్కలా

పూర్ణమౌ "నెల్లూరు" పురమునందు

ఏతల్లి బిరుదంబు లెనయించె నల "పెద్ద

పవని భూపాలుని" సవిధమందు

ఏయమ్మ కారుణ్య మేడుగడగ నుండె

"కందుకూరి" వధాన కార్యమందు

ఏమాత ధారా సమృద్దుల నెసగించె

నెట్టనె "కనిగిరి" పట్టణమున

గీ. అట్టి లోకైకజనని, హృదంబురుహ ని

రంతరాభ్యర్చ్యమాన పాదాంబుజాత

జాతరూపమణీ విభూషా విశేష

భూషితాకార సత్ సభ బ్రోచుగాక!