పుట:AndhraRachaitaluVol1.djvu/337

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రస్థానములు పఠించిన వేదాంతి యైనను, రసతత్వము తెలియని శ్రోత్రియమాత్రుడు కాడు. మంచి లౌకిక విజ్ఞానము కలవాడు. గొప్ప దేశాభిమానము కలవాడు. పతితాంధ్ర సామ్రాజ్య విభవమును గూర్చి వగచు జాతీయ కవిశిరోమణి. 'ఎండ్లూరు' పూర్వసంపదను స్మరించుకొని రచించిన యీ సీసములు సువర్ణములు.


నీమట్టిలో బుట్టి నిఖిల దేశంబుల

వెలిగించియుండెగా తెలుగు వెలుగు

నీనీట తేటయై నానాస్థలంబుల

నాక్రమించెనుగదా యాంధ్రకీర్తి

నీలోని గాలిలో లీలయై పలుచోట్ల

జెంగలించెనుగా, త్రిలింగదీప్తి

నీపైరుపంటల నిగ్గయి యెల్లచో

దనరారియుండెగా, తెలుగుశక్తి


యే జెముడుపొదలన్ లోన నిమిడి దాగి

యుండెనో యిప్పు డల్ల నీయుచ్ఛ్రయంబు

రామచంద్ర రాజేంద్రుని రామభద్రు

భూరమణు గన్నతల్లి! యెండ్లూరుపల్లి!

పుడమి వేల్పులకు నీపుత్త్రులొసంగిన

రమ్యమహాగ్రహారముల పేర్లు

జంగము కథలలో శృంగార పూరమై

పాఱుచునుండెడి వీరరసము

తాతలనాటి కథల్ చెప్పుకొనుచుండు

కులవృద్ధుల బెడంగు గలుగు నుడులు

క్షాత్త్రప్రియుల్ మది స్మరియించుకొని శిర

శ్చలనంబుతో జేయు శ్లాఘనములు