ప్రకటతరాశుధారను సభాపదులెల్లరు మెచ్చుచుండ, నా
యకమణి సంతసింపగ నయారె! రచించినవాడవీవు, వా
రక యరవింద సుందర మరంద ఝరంబు స్రవించుచుండు నీ
సుకవిత గాచుకో దగవె సుబ్బనశాస్త్రి! జగద్ధితంబుగన్.
'తిరుపతిశాస్త్రి'
ఇదిగాక, సికిందరాబాదు మున్నగు ప్రసిద్ధస్థలములలో వీరుగావించిన శతాష్టావధానములు, ఆశుకవితా ప్రదర్శనములు పలువుర ప్రశంసల నందుకొన్నవి. తెలుగునను సంస్కృతమునను వీరు సమాన వేగముననే కవితచెప్పగలిగిరి. ఎట్టివాడైన సంస్కృతములో దడవు కొనకుండ మాటాడునలవాటు మనప్రాంతీయులలో గడునరుదు. శాస్త్రులుగారు నిరాఘాట ధోరణి మాటాడునపుడు పండితులు దిగ్ర్భాంతి పడువారు. ఇది యత్యుక్తి కాదు. ఏలేశ్వరపు నరసింహశాస్త్రిగారొకరు సంస్కృతాశుధోరణిలో బేరుపడ్డవారు. 'ఆశుకవితిలక' బిరుదాడ్యులగు సుబ్రహ్మణ్యశాస్త్రిగారు తమగురువుల నిటులు పేరుకొనిరి.
శ్రీయుతులు బొడ్డుపలి సుబ్బరాయబుధుని
కొలచల నృసింహశాస్త్రిని గురువరులను
స్తుతి యొనర్చి, యద్దేపల్లి సోమనాథ
తార్కి కాగ్రణి దేశికు దలతు మదిని. 'ఆంధ్రధ్వని'
తరువాత శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారి సన్నిధికిజేరి, వేటూరి ప్రభాకరశాస్త్రి పాదుని సహాధ్యాయత్వమున 'సిద్ధాంతకౌముది' పాఠము చేసిరి. శ్రీ బ్రహ్మానంద తీర్థస్వాములతో బ్రస్థానత్రయమధ్యయనము గావించిరి. తర్క వ్యాకరణములు, వేదాంతము, ధర్మశాస్త్రము, అలంకారము మున్నగు వివిధశాఖలలో వీరి కనల్పమగు పరిజ్ఞాన మున్నదనియు, నాంధ్రములో వీరిపాండితి యుద్దండ మైనదనియు బండితు లెన్నుకొందురు. ఈయన ప్రాచీనవాజ్మయమును దఱచిన లక్షణ వేత్తయైనను, నూతనత్వమెఱుగని ఛాందనుడు కాడు.