పుట:AndhraRachaitaluVol1.djvu/335

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి

1883 - 1935

తెలగాణ్యశాఖీయబ్రాహ్మణుడు. కృష్ణయజుశ్శాఖీయుడు. భారద్వాజస గోత్రుడు. ఆపస్తంబసుత్రుడు. కన్నతల్లి: మహాలక్ష్మమ్మ. కన్నతండ్రి: రామయ్య. పెంచుకొన్న తల్లిదండ్రులు: లక్ష్మీదేవమ్మ, వేంకటప్పయ్యలు. అభిజనము: గార్లపాడు (బాపట్ల తాలూకా) జననము: 1883- నిర్యాణము: 1935. కృతులు: 1. జీవన్ముక్తి - విదేహముక్తి. 2. సగుణోపాసన - నిర్గుణోపాసన 3. దైవబలము (చిన్న పద్యకావ్యము). 4. ఆంధ్రధ్వని (ధ్వన్యాలోకమున కనువాదము) 5. తెలుగు కావ్యాదర్శము. 6. కావ్యనాటకాది పరిశీలనము. 7. మేఘము (కావ్యము-అముద్రితము).

ఆశుకవితలో నవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రిగారి కాంధ్రమున మంచిపేరున్నది. 1910, 11 సంవత్సరముల ప్రాతమున దిరుపతి వేంకట కవులకు గొప్పరపు సోదరకవులకు నాశుకవితా విషయమున హోరాహోరి యుద్ధము తటస్థించినది. 'గుంటూరుసీమ' పూర్వోత్తరరంగములు తన్మూలముననే రచింపబడినవని తెలుగువారి కెల్లరకు దెలియును. కొప్పరపువారితో గవిత్వపుబోటీకి నీ సుబ్రహ్మణ్యశాస్త్రులు గారిని నాడు తిరుపతివేంకటకవులు పంపించిరి. వేమవరాగ్రహారమున దత్ప్రర్శనము గావింపబడినది. ఓహో! శాస్త్రులుగారి కవితాజవమునకు బట్టబగ్గములులేవు. కొప్పరపుగవు లోడిపోయిరి. శాస్త్రులుగారు నెగ్గివచ్చిరి. గురువులు తిరుపతి కవులు శిష్యుని మెచ్చుకొని యిట్లు వ్రాసి యిచ్చిరి.


అన్నంబెక్కడనో భుజించితిని విద్య న్నాకడ నేర్చి; తెం

దున్నీయందు లవంబు గాననుజుమీ దోషంబు, దుశ్శాత్రవుల్

నన్నున్ మార్కొన వారియాశువుల చందంబెల్ల నవ్వారి సు

బ్బన్నా గెల్చిఋణంబు దీర్చితివి మమ్మా! శిష్యచూడామణీ!

'వేంకటశాస్త్రి'