Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/332

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏకాంతసేవకు బీఠిక వ్రాసి వ్రాసి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు చివర కిటులు తమ యభిప్రాయము తేల్చినారు. "ఇది విమర్శనాతీతము. వంగభాషకు రవీంద్రుని గీతాంజలి యెట్టిదో, మన యాంధ్రమున కీ మహాకవుల - భక్తుల యేకాంతసేవ యట్టిది"

వేంకట పార్వతీశ్వర కవుల భావరాశి స్వాభావికమైనది కాని, యాంగ్ల వంగములనుండి దొంగలిగొన్నది కాదని మన మనుకొనవలసిన విషయము. వీరి 'కావ్యకుసుమావళి' రెండు సంపుటములు చూడుడు! కవిత యెచ్చోటనేని సహజతలో గొఱతపడినటులున్న దేమో!

తిన్నని నున్నని తెల్లని యెనలేని

మొగ్గలలోనుండి నిగ్గుదీసి

చక్కని చిక్కని సరిలేని కమ్మని

పూవులలోనుండి ప్రోవుజేసి

విఱుగని తఱుగని వెలలేని తీయని

తేనియలోనుండి తేటదీసి

నలగని తలగని నలిలేని తొలిలేని

చివురాకుదొన్నెల సేకరించి-

ఆంధ్రకవితా సరస్వతి నమ్లానపుష్పోపహారములతో నర్పించిన కవివరులు వీరు. కవితలో దఱచుగ బదముల పున:పునరావృత్తి వీరి కిష్టము. నవ్యకవితావతారమునకు ముందే యనేక నూతన విషయములపై వీరిలేఖిని 1909 సం.కంటె దొల్లి పత్త్రికలలో వెల్లివిరిసినది. కొన్నిరకముల కవితామార్గములకు వేంకట పార్వతీశ్వర కవులు దర్శకులుగాని, వీరు వేఱొకరి కవితతీరు ననుకరించినటులు మన మనుకొనరాదు. అట్టి స్వాభావికత వారి రచనలో బదముపదమున బరికింపవచ్చును. ఈ జంట