పుట:AndhraRachaitaluVol1.djvu/330

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ కవు లిర్వురును గురుముఖమున సంస్కృతమునుగాని, ఆంగ్లముగాని యధ్యయనము చేయలేదు. వీరికి వంగభాష కొంచెము వచ్చును. మిత్రునివలన గన్నడములో ననువదింపబడిన బంకించద్రుని నవల నొకదానిని చదివించుకొని విని, వంగ వాజ్మయపు సొగసులకు, బంకించద్రుని కల్పనముల పొంకమునకు నివ్వెఱపడి మెల్లమెల్లగ నాభాషలో గృషి చేసిరి. ఆ కృషియైనను సాధారణమైనదే. ఏమైన నేమి! వంగము కాదు, ఆంగలము కాదు, అన్యభాష లెన్నో యెఱిగినవారికంటె గూడ వీ రెక్కువ సేవ చేసిరి. వీరి నవలలోని రచనసొంపు వేఱే నేను వక్కాణింప నక్కఱయుండదు.

అనువాదములు గావించిరి. కల్పనములును జేసిరి. ఏవి రచించినను సహజత్వము శైలిలో నుండుటచే వీరి రచనలు పాఠక హృదయములను హత్తుకొన గలిగినవి. వీరి నవలావాజ్మయము తెలుగుతల్లి విహారమునకు 'బ్రమదావనము'. ఇక వీరి పద్యకావ్యముల సంగతి: 'అనసూయ' పత్త్రికలో మొట్టమొదట 'ఏకాంతసేవ' కావ్యము బయట బడినది. అదియాది వీరి నాధునికులు మెచ్చి కవులలో నొక మంచిస్థాన మిచ్చినారు. 1922 లో నా కృతి యచ్చుపడి తెలుగువారి కెల్లరకు నందుపాటులోనికి వచ్చినది. వంగ సారస్వత మెఱుగరు. ఆంగలము తెలిసినవారు కారు. రవీంద్రుని భావోన్నతి వీరి కెట్టు లబ్బినదో యని యంద ఱబ్బురపడినారు. 'ఏకాంతసేవ' నేటి కృతులలో రసభావపరిపూర్ణమై యున్నదని యెన్నుకొనినారు. ప్రకృతి పులకించునటులు భక్తుడు జీవితేశ్వరుడైన యా పరమేశ్వరుని గూర్చి పాడుకొన్న ప్రణయ గీతముల సంపుటమీ 'యేకాంతసేవ'.

నా మెలంగుతోట నామాటలలో దేట

నావరాలకొంగు నావెలుంగు