Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/329

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ మువ్వురు నొకశాఖపై నున్న కోకిలములే. ఒకరి గానమాధురు లొకరు విని యానందపడినారు. వీరరాజ కవిగారి సహృదయత మల్లాముకవిని - కొమరగిరి కవిని తీసికొని వచ్చి సంధానము చేసినది. నాటి నుండి వేంకట పార్వతీశ్వర కవులు. ఈ జంట యేర్పడని సమయమున వేంకటరావుగారు 'ధనాభిరామము' నాటకము - 'సురస^ యను నవల వ్రాసికొనిరి. పార్వతీశముగారు పిఠాపురము మహారాజుగారి పట్టాభిషేకమునకు 1907 లో 'సువర్ణమాల' యను నాటకమును, 'తారాశశాంకము' అను వేఱొక నాటకమును రచించిరి. ఇవియే ప్రత్యేకరచనలు. తరువాతివన్నియు వేంకటపార్వతీశ్వర విరచితములే. కవ కలిసినతోడనే 'అనురూప' యను కావ్యము రచించిరి. అది యిపుడు 'చిత్ర కథా సుధాలహరి' గా బ్రచురింప బడినది. ఈ కవుల మేలి కలయికవలన 1911 లో నాంధ్ర ప్రచారణి వెలసినది. కార్యస్థానమునకు సూత్రపాతము తణుకులో జరిగినది. అక్కడ నొకయేడు మాత్రము ముండి నిడదవోలు - రాజమండ్రి - కాకినాడ - పిఠాపురము క్రమక్రమముగ సంచారము చేసినది. 1980 సం. దాక నీగ్రంథమాల మహోన్నతస్థితిలో నున్నది. శ్రీ కొవ్వూరి చంద్రారెడ్డిగారు తొట్టతొలుత 'ప్రచారిణికి' సహకృతి చేసిరి. ఆయన చేతిచలువ వలన నా గ్రంథమాల కట్టి ప్రఖ్యాత వచ్చినది. చంద్రారెడ్డి తెలుగు వారికి స్మరణీయుడైన వ్యక్తి. ఆంధ్రప్రచారిణికి దీటువచ్చు గ్రంథమాలలు మననేలలో రెండో మూడో. చక్కని వచన వాజ్మయమును సేవించిన గ్రంథమాలలే తక్కువ. 1980 నాటికి ప్రచారిణి వెలువరించిన గ్రంథముల సంఖ్య 170. ఆంధ్రప్రచారిణికి బ్రాణము వేంకట పార్వతీశ్వర కవులు. ఈ జంటకవులకు నడుమ నడుమ బొడముచుండు మానసికములగు కలతలను ప్రచారిణి మధ్యవర్తినియై తొలచుచుండెడిది. రెండు దశలు గ్రంథమాల జాతకము విఖ్యాతముగ వెలిగినది. వేంకట పార్వతీశ్వర నవలలు తెలుగులో నలుమూలల బేరు సంపాదించుకొన్నవి.