పుట:AndhraRachaitaluVol1.djvu/328

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తీశ్వర కవులు కారణము. ఆంధ్రములో నభినవరీతులుగల నొకతీరు కవితకు అంకురార్పణము చేసినవా రీ జంట కవులే యని నేటి వారిలో మేటికవులు కొందఱభిప్రాయపడు చున్నారు. ఈయభిప్రాయమున కాయుగళము రచించిన 'ఏకాంతసేవ' యనుకృతి పట్టుగొమ్మ. అనుకృతి దారికి లోక, సాజముగా వచ్చిన తియ్యని బాసతో గొత్త వడుపున భావవిలక్షణత రాణించు కవితను రచించు నేటివారిలో 'వేంకట పార్వతీశ్వరకవులు' కడుగౌరవనీయు లనుట స్వభావోక్తి. ఇక వీరి చరిత్రాదికము గూర్చి ప్రకటించెదను.

బాలాంత్రపు వేంకటరావుగారు 'ప్లీడరుగుమస్తా' పని చేసుకొనుచు నేవో యల్లిబిల్లిపద్దెము లల్లుచుండెను. ఓలేటి పార్వతీశముగారు చెలికాని లచ్చారావుగారి దగ్గర నుండి యచ్చుపనులు చూచుచుండెను. 1908 సంవత్సరప్రాంతముదాక నీ కవకవు లొకరినొక రెఱుగరు. కాని, యిరువురు పిఠాపురమునకు బరిసరములోనే యున్నారు. విమర్శకాగ్రేసరులని ప్రసిద్ధి పడసిన శ్రీ నడకుదిటి వీర రాజకవిగారు విద్వజ్జన మనోరంజనీ ముద్రాలయద్వారమున సారస్వతసేవ గావించుచు నాడు పిఠాపురముననే కాపురముండి యున్నారు. ఈ మహాశయుడే మన ప్రస్తుత కవు లిరువురకు నేతుసంధానము చేసినవారు. ఆచంట సాంఖ్యాయనశర్మగారి సంపాదకత్వమున "కల్పలత" యను పత్త్రిక నడుచుచున్నతఱియది. ఆకల్పలతలో భాషాసంబంధములగు ప్రశ్నములు, సమస్యలు వెలువరింపబడెడివి. ఒకనెల గొన్ని ప్రశ్నములకు వీరరాజకవియును బిఠాపురము నుండి ప్రత్యుత్తరములు వ్రాసి పంపెను. వానికే పార్వతీశముగారు సమాధానము లంపిరి. వేంకటరావుకారు నెక్కడనుండియో వ్రాసి పంపించిరి. ఒకరివిషయ మొకరెఱుంగరు. పార్వతీశముగారికి ప్రథమ బహుమానము. వీరరాజకవికి రెండవభుమానము. వేంకటరావుగారికి మూడవ బహుమానము నిచ్చినటులు పత్త్రికలో బ్రకటితమైనది.