మ్మనఘా! యిదియ పణమ్ముగ
గొని నేవర్తకము జేసికొందు నటంచున్.
క. చచ్చిన యాయెలుకను నా
కిచ్చినయటు పద్దు వ్రాసి యిడి యతనికి, నే
దెచ్చితి దానిం గని యత
డచ్చెరుపడి నవ్వు కొనుచు నభినందింపన్.
ఈ తీరుగా మెత్తని నిర్దుష్ట శయ్యలో నీకృతి యున్నది. వారి చేతి మీదుగానే కృతి తుదముట్ట కుండుట దుర్విధి. 'నూటఏబదియార్లు' అనుపేర బరమేశ్వరుని గూర్చి వీరు సీసములు రచించిరి. అవి సువర్ణములు. ఈ కబ్బము తెనుగువారి డెందము లుబ్బింపగల గీతాంజలి. ప్రతిభాజన్య మయిన దీనికి దగినంత ప్రశస్తి దేశమున లేదు.
హృదయ పాత్రంబులో నేమియున్నదొ కాని
తొలకుచున్నది నిన్ను దలచినపుడు
ఈ మన:ఫలకమం దేమి యున్నదొ కాని
మ్రోగుచున్నది నిన్ను మ్రొక్కినపుడు
శీర్ష పేటిక నేమి చిత్రమున్నదొ కాని
మూయుచున్నది నిన్ను ముట్టినపుడు
ఈ భావవీథిలో నేమియున్నదొ కాని
తారుచున్నది నిన్ను గోరినపుడు
రమ్ము! నాతండ్రి! నను జేరరమ్ము! ప్రణతి
గొమ్ము! కరుణించి నన్నేలుకొమ్ము! చేర
నిమ్ము! నీదర్శనంబు నాకిమ్ము! నిన్నె
నమ్మినాడను శాశ్వతానందనిలయ!
__________