వీథివెంబడి బోవుచుండు నపుడు అరగులపై బాఠములు చెప్పుచుండు పండితులు జంకు చుండెడి వారట. ఇతని కబ్బినది ప్రాక్తన జన్మవిద్యగాని యభ్యస్తముగాదని యిచ్చటివారు ముచ్చటగా జెప్పుచుందురు. ప్రాకృతమున 'గుకవినిందనము' - సంస్కృతమున "కర్ణవిజయ వ్యాయోగము" వ్రాసినాడు. ఇవి యముద్రితములు. ఇంత చిన్న తనముననే బహుగ్రంథములు సంధానించి, సంస్థాన విద్వత్కవియై పేరు మోసిన కృష్ణుడు కవిలోక జిష్ణుడు. "కృష్ణకవి నోట బంగారు గిలక దీట." సహకవి యెడబాటు పిమ్మట, జంటలో దొంటివారగు వేంకట రామశాస్త్రిగారు-
అనగు మేనత్త కొమరుడై యాశుకవిత
నాకు జేదోడు వాదోడునై కడచిన
కృతి సమర్థుండు మారామ కృష్ణ శాస్త్రి
యున్న నీ సాయ మర్థింతునోటు దేవి!
చనియె గదమ్మ నీ యపరజన్మవిలాసము మాకుజూప వ
చ్చినగతి వచ్చి సత్కవితచే గవికోటికి వన్నె దెచ్చి యం
తనె యతడట్లు నీతనువునన్విలసిల్లిన నెవ్వ రింక నా
పొనరుచు నీకృతి క్రియకు బూనిక దోడ్పడువారు భారతీ!
అని దు:ఖించు సోమ దేవ భట్టారక విరచితము, అష్టాదశలంబకాత్మకము నగు 'కథాసరిత్సాగరము'నాంధ్రీకరింప దొడగిరి. అందాఱు లంబకము లయినవి. ఆంధ్ర కథాసరిత్సాగరము లోని కవితా శైలి నన్నయ కవిత్వపు దెన్నునకు దీటు వచ్చునట్లున్నదని తెలుగు దేశములోని పండిత కవులెందఱో కొండాడియున్నారు. ఆ కృతిపీఠికలో నాధునిక కవిత్వమునుగూర్చి వేంకట రామశాస్త్రిగారి యభిప్రాయ మిట్లు తేలినది.