పుట:AndhraRachaitaluVol1.djvu/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సూర్యప్రకాశకవి మూడు కృతులు రచించెను. అందు మొదటిది సీతారామ చరిత్రము. ఇందున్నవి యాఱుశ్వాసములు. ఆంధ్రసాహిత్యపరిషత్తు బాలకాండముగల ప్రథమాశ్వాసము 1941 లో వెలువరించినది. ఈ కృతి కృష్ణభూపతి యాజ్ఞచే శ్రీభీమలింగేశ్వర దేవున కంకితము. పూర్వాంధ్ర కవుల నీకవి యభినుతించుచు నొక సీసము వ్రాసెను. అందు గవి కాలము సక్రమముగ బాటింపలేదు. నన్నయ, తిక్కన, శ్రీనాథుడు, ఎఱ్ఱన, భాస్కరుడు, భీముడు, పోతన, రంగనాథుడు, రామభద్రుడు, సోముడు - ఈ కవి యెత్తుకొనిన కవుల వరస యిది. సమకాలికుడైన పిండిప్రోలి లక్ష్మణకవి నితడు కొలిచెను. దీనికి గారణమొకటి యని తోచెడిని. లక్ష్మణకవి ద్వ్యర్థి కావ్యము వ్రాసెను. ఈయనకును ద్వ్యర్థి కావ్యము రచింప నప్పటికే తలపు కలిగెను. ఆ తలపు క్రమముగ 1863 సం లో "కృష్ణార్జునచరిత్రము" గ ఫలరూపము నందినది.

సూర్యప్రకాశకవి తనప్రభునిచే నిటు లనిపించుకొనెను:

చ. ప్రవిమల భక్తి శంభుపదపంకజపూజన మాచరింపగా
నవిరణ శబ్దశాస్త్రములయర్థము లొప్పగజెప్ప నుల్లస
న్నవరసభావ కావ్యరచనాపటిమ న్నృపకోటికి న్మహా
కవులకు మెచ్చుగూర్పగబ్రకాశకవీ! చతురుండ వెన్నగన్

ఈ కవి శివభక్తుడనని తఱచు చెప్పుకొనియు 'సీతారామచరిత్రము' రచించి తన యద్వైతాభిమాన మావిష్కరించెను.

ఇతడు రచించిన 'కృష్ణార్జున చరిత్ర' మను రెండాశ్వాసములు గల ద్వ్యర్థి కావ్యము శ్రీవిక్రమదేవవర్మ మహారాజుగారి టీకతో 1905 లో వెలువడినది. ఇందు పారిజాతాపహరణ విజయవిలాసార్థములు గలవు. శ్లేషకావ్యమైనను పింగళి సూరన కవిత్వచ్ఛాయలలోనుండి కుంటి నడక లేకుండ నున్నది. శబ్దశ్లేష కంటె నర్థశ్లేష ప్రధానముగా గ్రహింపబడినది. శబ్దశ్లేషలో రాఘవపాండవీయ విధానము నాశ్రయించెను.