పుట:AndhraRachaitaluVol1.djvu/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ కవి విద్యాగురువులు మూవురు. కందర్ప సీతారామశాస్త్రి గారు బాల్యగురువులు. దేవులపల్లి తమ్మయసూరి గారు, వాడవల్లి అనంత పద్మనాభాచార్యులు గారును భాషాచార్యులు. వీరికడ నడకువతో నుభయ భాషలు జక్కగ సాంప్రదాయసిద్ధముగ నభ్యసించెను. కవితా ధార ఇతని కాజానజమైన యలవాటులోనిది. తల్లి వంకవారును, తండ్రి వంకవారును బండితకవులు.

ఈ కవి మేనమామ మంచికవియట. సీతారామచరిత్రలోని ఈ పద్యము చదువుడు.

సీ. ఏమహాత్మునితాత యీశ్వరారధన
ప్రముదితస్వాంతుండు బసవరాజు
ఏగుణాధికుతండ్రి హిమశైలకైలాస
నురుచిరపత్కీర్తి జోగిరాజు
ఏసుధీమణియన్న భాసురాత్మజ్ఞాన
పటుమనీషాశాలి బసవరాజు
ఏధన్యునూనుం డనేక బాంధవజన
సుత్య సద్గుణవార్థి జోగిరాజు

అట్టి విస్సాప్రెగడ సత్కులారత్నంబురాశి
సోము సుకవిత్వధారాభిరాము నాకు
మేనమామయు మామయై మెఱయువాని
నధిపకృతసఖ్యు గామరాజాఖ్యు దలతు.

ఈ కవి తండ్రి నిటు నుతించెను.

క. ప్రవిమలభక్తి నుతింతును
రవిసన్నిభతేజు శరభరాజ సమాఖ్యున్
కవితామహత్వ జితభా
రవికవి మజ్జునకు శరభరాజసమాఖ్యున్