పుట:AndhraRachaitaluVol1.djvu/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంత్రిప్రెగడ సూర్యప్రకాశకవి

1808 - 1873

ఆరువేలనియోగి బ్రాహ్మణుడు. హరితసగోత్రుడు. ఆపస్తంబసూత్రుడు. తల్లి: సీతమ్మ. తండ్రి: శరభారాజా మాత్యుడు. జన్మస్థానము: పిఠాపురము దగ్గరనున్న తిమ్మాపురము. జననము: క్రీ.శ. 1808 విభవ సంవత్సరము. నిర్యాణము: 1873 సం||రం మే 11 తేదీ, శ్రీముఖ సంవత్సర వైశాఖ శుద్ధ చతుర్దశి భానువాసరము. గ్రంథములు: 1. సీతారామ చరిత్రము (ఆరాశ్వాసముల కావ్యము- 1851-52) 2. కృష్ణార్జున చరిత్రము (ద్వ్యర్థి కావ్యము - 1863) 3. భీమలింగ శతకము (1869.)

సూర్యప్రకాశకవి శ్రీ కృష్ణభూపాలునాస్థానమున బండితకవి. కృష్ణభూపాలుడు ' మాడుగుల ' సంస్థానప్రభువు. ఈప్రభువు స్వయముగా జదువుకొనిన పండితుడు. ఈయన 1813 లో నుదయించి 1875 లో నస్తమించెను. 1835 లో సంస్థానాధిపత్యము వహించి నలువదివత్సరములు రాజ్యమేలెను. అల్లంరాజుసుబ్రహ్మణ్యకవివరు డీయనపై " కృష్ణభూపతిలలామశతకము " రచించెను. శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి యీ ప్రభువుచే సంభావితుడయ్యెను. బులుసు పాపయ్యశాస్త్రి, ఇంద్రకంటి గోపాలశాస్త్రి మున్నగు విద్వత్సత్తము లీయుత్తమభూపాలుని దర్శించి సంతోషించుచుండెడివారు. సాహిత్యముకలిగి సమర్థు డైనప్రభుని యాస్థానముననుండి గౌరవింపబడుట కవికి మహాభాగ్యము. అట్టి యదృష్టము పట్టుట యెక్కడనోకాని కన్పట్టడు. సూర్యప్రకాశకవి మంచి విద్వాంసుడు. చక్కనికవి. ఇతడు కృష్ణభూపతియోలగమున విద్వత్కవిగా వెలసెను. ప్రభుదర్శనమునకు వచ్చుపండితులను గౌరవించి రాజసన్మానము గావింపించి పంపించుచుండెను. అతని సహృదయత ప్రశంసనీయముగదా !