Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/316

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భోజనమాను నర్థి సురభూజుని జూచితిరే? పిఠాపురీ

రాజు నతండు మిమ్ము గవిరాజుల నెట్లు బహూకరించె? సం

చోజను గోరువారికి సదుత్తర మిచ్చి తదాసనంబులం

దేజరిలంగ జేసెడుగతి న్మము నీవును గారవింపుమా !

     *            *            *

అక్షరలక్ష లిచ్చునృపు డట్టి కవీంద్రులు కానరా రటం

చీ క్షితివారలెల్ల వచియించెడు నుద్దుల నాలకింతె హ

ర్యక్షసదృక్ష ! నీవును దిరంబుగ నేమును గక్షగట్టి ప్ర

త్యక్షము సేయ బూనెదమె ? తత్సములం గవుల న్న రేంద్రులన్.

     *           *            *

ధారణతప్పరాదు, కవితారసమాధురి పోవరా, దలం

కారము లేగరాదు, కనగా నవశబ్దము లుండరాదు వా

గ్ధోరణి యాగరాదు తమతోడ బ్రగల్భములంట గాని, యె

వ్వారికినైన నిట్లు నొడువంగలవార మనంగ జెల్లునే?

వీరు పిఠాపుర సంస్థానమున బ్రవేశించిన వెనువెంటనే సుప్రసిద్ధులైన తిరుపతి వేంకటకవులతో వాగ్యుద్ధము తటస్థించినది. రామకృష్ణకవులు వయసున బసివారయ్యును నా కవుల కృతులలోని దోసములు బయట బెట్టి 'శతఘ్ని' యను ఖండన గ్రంథము ప్రకటించిరి. 'శతఘ్ని' శక్తి నాడు పెద్దపండితులను గూడ దల లూపించినది. ఈ సాహిత్య సమరముననే రామకృష్ణ భారతము, పాశుపతము, అట్టహాసము, శృంగభంగము, కోకిలకాకము మున్నుగా నెన్నో రచనలు వెలువడినవి. ఈ వివాదము తొలుత జక్కని కృతివిమర్శనములతో నారంభమై క్రమక్రమముగా శ్రుతి మించి వ్యక్తిదూషణములకు బాలుపడి ముదిరినది. ఏది యెటులయిన, నాటి యీవివాదము సాహిత్యజిజాస హెచ్చించి ముచ్చటగా సాగినది. ఈ వాక్సమరమున దేశము