ఏ సుముహూర్తమున నీ జంటకవులు ప్రభువుకంట బడిరో యపుడే శ్రీవారి యనుగ్రహాంకూరము రామకృష్ణుల యభ్యుదయ క్షేత్రమున బడినది. దిగ్దంతులవంటి పండితులమ్రోల నా మహాస్థానమంటపమున నత్యద్భుతావధానము సేయునపుడు రామకృష్ణుల లీలలు పలువుర కానందాశ్చర్యములు కలిగించినవి. మహీనాథు డవధానానంతరము మూడు నూటపదియార్లు పట్టుసాలువలతో బహూకరించి యా కవులను దమ సంస్థానిలో నుండగోరెను.
పిమ్మట నత్యద్భుత శతావధానము, శతవిధానము [గంటకు నూఱుపద్యములు చెప్పుట] శతప్రాసము [ఒకేప్రాసముమీద నూఱు పాదములు గంటలో జెప్పుట] అష్టావధానము మున్నగువానిచే మన కవులు మహారాజు చిత్తమును మఱింత రంజింపజేసిరి. శతప్రాసము చెప్పుసందర్భమున "...ఇట్లిరవుగ గొన్నిపాదములనే మును గబ్బము తాత సెప్ప న, బ్బురపడి తత్సభాస్థలిని బోరన గద్దియ డిగ్గి గండ పెం, డెరమును గృష్ణరాయుడు తొడ్గె న్నృపపుంగువ!..." అని యభిప్రాయగర్భముగా నెట్లుచెప్పిరో పరికింపుడు.
వేంకటరామకృష్ణులు పిఠాపురసంస్థానమునకు బోవుచున్నటు లింటియొద్ద బెద్దవారి కేరికిని జెప్పనేలేదు. పట్టుసాలువలు కప్పుకొని సింగపు బిల్లలవలె వచ్చుచున్న యా యువకవుల గని తలిదండ్రు లానందభరితులైరి. గ్రామస్థు లాశ్చర్యకలితులైరి. ఈ జంటలో దొంటికవి ఓలేటి వేంకటరామశాస్త్రి, ద్వితీయుడు వేదుల రామకృష్ణశాస్త్రి. వీరు మేనత్త మేనమామ బిడ్డలు. వీరిని స్మరించునపుడు నంది మల్లయ్య, ఘంట సింగన జ్ఞప్తికి వత్తురు. జంటకవులలో దిరుపతి వేంకట కవులపేరు లెటులు కుదిరినవో రామ కృష్ణ కవుల నామము లట్లు సరిపడినవి. ఈ కవికోకిల యుగళము పిఠాపుర ప్రభుని మ్రోల మధురకంఠము లెత్తియిట్లు పాడినది.