రుడులేడు. వేంకటేశ్వరుడు లేనిదే తిరుపతిలేదు. ఈ జంటపేరులిట్లు కుదురుటయే వీరిఘనతకు గారణమని చెప్పవలయును. ఎక్కడ వినినను వారిపద్యములే. ఎక్కడ జూచినను వారిశిష్యులే. ఏ ప్రాంతమున దిరిగిన వారియవధాన ప్రశంసలే. "తిట్టుల్ తిట్టితి దిట్టులంబడితి" నని యనేకుల హుంకరించినారు. అనేక పండితులను గద్దించినారు. "అటు గద్వాలిటు చెన్నపట్టనము మధ్యంగల్గు దేశమ్ము" నొక యూ పూపినారు. పేరి కాశీనాధశాస్త్రివంటి యుద్దండపండితుల 'నబ్బా' యనిపించినారు. మహామహోపాధ్యాయులు సైతము మర్యాదగా, దప్పించుకొని తిరుగుచుండెడివారు. అది కేవలము వారిశాస్త్రపాండిత్యమునకు జంకియనుటకు వీలుగాదు. తిరుపతికవులు సంస్కృతాంధ్రములలో బెద్దపాండిత్యము కలవారేయైనను శాస్త్రేతరములందు బ్రత్యేక కోవిదులైన మహామహులను గూడ మాటాడనీయక పోవుట మాత్రమాంధ్రలోకమున కాశ్చర్యావహమైనది.
తిరుపతిశాస్త్రిగారు ప్రాచ్యపాశ్చాత్య భాషలయందు విద్వాంసులైన పోలవరము జమీందారు శ్రీ కొచ్చెర్లకోట వేంకటకృష్ణారావు బహద్దరు వారికడ నిలయ విద్వాంసులుగా నుండిరి. కొన్నివత్సరములు వారియొద్ద గౌరవవేతనము బడయుచు ననేకభంగుల సన్మానింపబడిరి. ఇంతలోగాల మీ మహాకవిని మ్రింగివైచినది. తిరుపతిశాస్త్రి యస్తమయము చెళ్ళపిళ్ళకవి హృదయమునకు బట్టరాని కష్టపాటు కలిగించినది. ఇరువురు నభేదముగా సంచరించిన సోదరులు. వేంకటకవి దివాకరాస్తమయమును గుఱిచి యిటులు పలవించెను.
నాకన్న థీబలమ్మున
నే కాదు తనూబలమున నెంతయు హెచ్చొ
లోకస్తుత్యుడు తిర్పతి
నా కన్నన్ మున్నె యెట్లు నాకము ముట్టెన్.