పుట:AndhraRachaitaluVol1.djvu/306

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏబది దాటెనా, కతని కేబది కింక నెలల్ కొఱంత నా

ల్గా బుధమాన్యు డిందనుక నాగక సల్పె శతావధాన, మే

నొ బహుకాలమై యొకట నుండియు నాతనిచేయియూత బ్ర

జ్ఞా బహుళావధానపు బ్రసంగము లీడ్చుచునుంటి నెట్టులో.


ఈ జంటకవుల సౌహార్ద మిట్టిది. "ఒక్కరు రచియించిరేని నది కాదగుదిర్పతి వేంకటీయమై" అను మాటలో నంతర్వాహినిగా వీరి సౌభ్రాత్రము వెల్లివిరియుచున్నది. తిరుపతి కవి నిర్యాణమున కిటీవల వేంకటశాస్త్రిగారు పెక్కు కృతులు రచించినారు. అవన్నియు జంటపేళ్లతోడనే ప్రచురితములగుట యొక మహాదర్శము.

చెళ్ళపిళ్ళకవి కవిత్వపుగఱుడు. అనగా, ఆయన నిలువెల్లగవిత. పండు వయస్సులో నాయన కలము కొన్నివేల గద్య పద్యములు సృష్టించినది. వ్యాసునివలె వ్రాసినది తుడుచుట యాయన కలవాటులేదు. కడకాలమున విజయవాడ గవర్నరుపేట యందలి యద్దెయింట గుక్కిమడత మంచముపై కౌపీనధారియై పరుండియుండెడి యా జరఠమూర్తి నెందఱెందఱో దర్శించి పోవుచుండెడివారు. ఆయన మెట్టిన ప్రదేశమే యొక దివ్యతీర్థము. మనసు వచ్చినచో వచ్చిన మానిసిని బలుకరించుచు; లేనిచో బలుకరించుట కూడ నుండదు. వచ్చినవాడు వచ్చి కవిగారి చరణములు కనుల కద్దుకొని చక్కబోవును. ఆ యాగంతుకున కదే పదివేలు. యౌవనములో వేంకట శాస్త్రిగారి యుపన్యాసవాణి మేజువాణి. ఆయన సభలో నుపన్యసించు నపుడు వేనవేలు విఱుగబడి వినవలసినదే. యౌవనములోనే కాదు, షష్టిపూర్తి దాటిన తరువాత గూడ వారి కంఠస్వరములోని ఝంకారము, మాధుర్యము సడలలేదు. ఎంతవానినైన నప్పటి కప్పుడు ముఖపిధానము సేయు శక్తియాయనలో గొప్పగా నుండెడిది. వీరి ప్రతి పదము ధ్వనిపూరితము, వీరి పేరు విని బందరు నందలి యున్నత పాఠశాల పండితులుగా దయచేయుడని యాహ్వానించినది.