పరిశోధనల జేసి సప్రమాణముగా నాయన వాదమును గాదని వాదించిరి. ఇది వీరి చరిత్ర పరిజ్ఞానము వెల్లడించుటకు బనికి వచ్చును. వీరు ప్రత్యేకముగా 'మనుచరిత్ర హృదయావిష్కరణము' రచించిరి.
చిన్ననాట శేషాద్రిశర్మగారు కడపలో విద్యాభ్యాసము కొన్నాళ్లు చేసిరి. అక్కడ సరిగ జదువు సాగమి కాశీపట్టనమునకు బదునొకండవయేట బయనము సాగించి , కాలినడకచే నాలుగేండ్లకు వారణాసి జేరికొనిరట. అచ్చట గొన్ని వత్సరము లుండి సంస్కృతవిద్యాధ్యయనముగావించి వచ్చి, విజయనగరము, కసిమికోటలలో బండితసన్నిధిని స్కంధత్రయాత్మకజ్యోతిర్విద్య నభ్యసించిరి. జ్యోతిశ్శాస్త్రమున శర్మగారు చాల బ్రజ్ఞావంతులు.
జ్యోతిషము చెప్పుచు నందఱ నాశ్రయించి తిరుగుట వీరి కిష్టముగాక కడపలోని యాంగ్ల పాఠశాలలో నాంధ్రపండితులుగా బ్రవేశించిరి.
నెల్లూరి కడనున్న జన్నవాడ క్షేత్రమున బినాకినీ తీరమున కామాక్షి మల్లికార్జునుల సన్నిధిని వీరు నడుమనడుమ బెక్కు నెలలు వసించి తపము గావించు చుందురని వినికి. ఆయుపాసనామహిమచేతనే వీరు మహోత్సాహముతో గంటకు వందలు పద్యములు వ్రాయుచున్నా రని చెప్పుదురు. ఒకమహాశయు లిట్లు వ్రాసిరి.
ఆ. వె. ఉన్నకవులలోన జన్నకవులలోన
నిన్నికృతులు వ్రాయ గన్న దెవరు ?
రాము డల్లపోతరాజునకుంబోలె
బలుకుదోడొ యేమొ ? లలిత నీకు.
వీరు నరాంకిత మొనరింపలేదు. జనమంచిశర్మగారు విద్వత్కవులే గాక సత్తములు, సహృదయులు, పరమభాగవతోత్తములు. దుర్విమర్శనములు దురహంకారములు వీరికినచ్చవు. ఒకపు డెక్కడో యొకసభలో