Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/287

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'లలితావిలాసము' న పుణ్యజీవనము గడుపుచున్నారు. వీరి యుభయ భాషాపాండిత్య మప్రతిమానము, పౌరాణికతత్త్వపరిజ్ఞాన మసమానము. ఉపనిషత్తులు చదివిరి. సూత్రభాష్యము నెఱిగిరి.

శేషాద్రిశర్మగారి యభినివేశ మాశ్చర్యకర మైనది. వీరు వ్రాసిన పద్యములు మొత్తము లక్షకు మించునేమో! "పాండిత్యమున నున్నవన కవిత్వమున లే" దని కొందఱివాదము. వస్తుస్థితి నిర్ణయించుట తరముకాదు. ఈ విమర్శ కాగినవారు పురాణకవులలో నెందఱుందురు ?

వీరు శ్రీమద్రామాయణమును దెనిగించిరి. అది స్వేచ్ఛానువాదము గాదు. విద్యార్థులకు సైతము సులభముగా దెలియుటకు శ్లోకమున కొక పద్యము చొప్పున వ్రాసిరి. విసుపు విరామము లేక యిన్ని పద్యములు వ్రాయుట కవి కుండవలసిన గొప్పశక్తులలో నొకటి. శర్మగారు మూర్తీభవించిన దైవభక్తి. వీరి గ్రంథము లన్నియు భగవత్పరములే. బ్రహ్మపురాణ మాంధ్రీకరించిరి. బ్రహ్మాండపురాణ మనువదించిరి. స్కాందమున కేతామెత్తి కౌమారికాఖండము కేదారారుణాచలఖండములు పరివర్తన మొనరించిరి. తాండవకృష్ణభాగవతము-సర్వమంగళా పరిణయము-హనుమద్విజయము- కృష్ణావతారతత్త్వము (12 భాగములు)-రామావతారతత్త్వము (10 భాగములు)-సంగ్రహ భారత భాగవత రామాయణములు ఈగ్రంధములన్నియు భగవత్సంబంధములే గదా? చరిత్రవిషయముగూడ నెఱుగుదు నని కడపమండలచరిత్ర - ఉదయగిరి ముట్టడి రచించి చూపిరి. శర్మగారికి మనుచరిత్ర మనిన నెక్కువ మక్కువ. పెద్దన వీరి దృష్టిలో మహామహాంధ్రకవి. ఇతని జన్మాదికమునుగూర్చియు, నీతని కవిత్వ విశేషములనుగూర్చియు వీరు చక్కని పరిశోధనముల జేసియున్నారు. అవి సమంజసముగా నుండును. పెద్దన బళ్ళారి మండలమున గల దూపాటుసీమనుండు 'దోరాల' గ్రామమున బుట్టెనని వీరేశలింగము పంతులు గారు వ్రాసిరి. ఈవిషయమున ననేక సార్లు