పుట:AndhraRachaitaluVol1.djvu/283

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శా. ఆవీట న్నడిరేయి వీథిబడి కాంతాగారమున్ జేరు న

ప్పూవుంబోణుల కల్లిబిల్లిగొని చూపున్ మాపు పెంజీకటిన్

నీ వెంతే నొరగంటి పై డితళుకున్నిద్దంపు క్రొమ్మించునన్

ద్రోవంజూపుము వారలుల్కుదురు చిన్కున్ మ్రోతలేకుండుమీ!

ఉ. పై దలిబాసె వీడను గృఫామతి కల్మినొ లేక చెల్మినో

కాదన కిట్టిపాటియుపకార మొనర్చి మదర్థనంబు మై

నాదట నిచ్చవచ్చు నెడలందు జరింపుము కార్బెడంగుతో

లేదవుగాక క్రొమ్మెఱగు లేమవియోగము నీకు వ్రేల్మిడిన్.

కవిరాజుగారు చట్టవిరుద్ధము-కూర్చొని మున్నగు నెరసులు కొన్ని శాకుంతల కవితలో దొరలించిరి. ఆనాటకములో నీచ పాత్రోచితమైన వాడుకభాష యెంతసొగసుగ నడ్చినదో?

క. ఇల నెంత చెడ్డదైనను

కులవృత్తిని విడిచిపెట్ట గూడదుగందా?

తలచుదుము చదుముకొని మే

కల జంపే బావనయ్య కటికోడయ్యా!

నీలాద్రిరాజుగారు పెద్దాపురమురాజ్యమును బరిపాలించిన శ్రీ రాజా వత్సవాయి వేంకటసింహాద్రి జగత్పతీంద్రుని యాదరమున దుని సంస్థాన కవిగానుండి పేరందెను. తునిరాణి శ్రీ సుభద్రాంబిక యీకవిని బహుగౌరవముతో జూచినది. నేటి తునిరాజుగారు శ్రీ వత్సవాయి వేంకటసూర్యనారాయణ జగపతిరాజావారి పట్టాభిషేక సందర్భమున బ్రదర్శనము చేయుటకై కవిరాజుగారు శాకుంతల మాంధ్రీకరించినటులు ప్రస్తావనలో నున్నది. శ్రీవారి సంస్థానమున నీయన జేగీయమానముగ శతావధానము గావించెను. ఆంధ్రభారతీ తీర్థవారు 'కవిభూషణ' యను బిరుదముతో నీయనను సత్కరించిరి. కవిరాజుగారు తాను శతావధాని నన్న సంగతి యీపద్యములలో బేరుకొనెను.