పుట:AndhraRachaitaluVol1.djvu/273

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ జనమంచి వేంకట రామయ్యగారి సర్వ కవితాహృదయము పలు పద్యములలో సురక్షితమై యున్నది. ప్రకృతితత్త్వములో నభిన్నుడైన యీ కవివరుని గుండెలో నమృతభాండముండె ననుటకు నిదర్శనము వీరి "నవకుసుమాంజలి." ఈ కూర్పు 23 ఖండ కావ్యముల సంపుటము. ఇందలి ప్రతిపద్యము రసోత్తరము. పాలమీగడవలె చక్కని చిక్కని కమ్మని కవిత వేంకటరామయ్యగారి చేతిలోనున్నది. ఆయన యక్షరాక్షరము తూచితూచి వేయును. చ్యుత సంస్కారములు చేరనీయక, హాయిగలిగించు శయ్యలో వీరు మంచినేరుపు చేకూర్చుకొనిరి. వడ్డాది సుబ్బారాయడుగారివలె వీరుకూడ బద్యము మలచి మలచి మెఱుగు పెట్టి మఱి వెలువరింతురు. భావములలో బ్రాతక్రొత్తల సొగసుకలయిక వారి కవితకొకయందము. పద్యము నెత్తుకొనుటలోను, దింపుటలోను, ప్రస్తరించుటలోను వీరొక నూతనత్వమును సహజముగా బ్రకటించిరి. ఆంగ్ల భాషా ప్రవేశము వీరి భావనాపథమున కొక నవవికాసము కలిగించినదని చెప్పుచుందురు. జీవితము ఛాందసప్రవృత్తిలో నడపించినను, భావములు జాతీయమార్గమున మెఱుగులు దేఱినవి. "అమృతభాండ"మను ఖండకావ్యము వేంకటరామయ్యగారి జాతీయ దృక్పథమునకు బతాక. ఈ కావ్యహృదయము కవియే యిటులు ప్రకటించెను. "హైందవ స్వరాజ్యసమితి వారి రాయబారమే యిందలి ప్రకృతవిషయము. ఈ ప్రకృతము, అప్రకృతమైన గరుడయాత్రాకథలో గొన్నిపట్ల స్ఫుటముగాను, గొన్నిపట్ల సూచనగాను వర్ణింపబడినది. ప్రకృతాప్రకృతముల నొండొంటితో సందర్భింపజేసి కావ్యమును కడవఱకును నేకార్థసమవేతముగా నిర్వహించుటకై రెంటియందును గొన్ని యావశ్యకములైన మార్పులుచేయబడెను. కావ్యాదిని ప్రతిజ్ఞాతమైన దాస్యనివృత్తికి, కావ్యాంతమందు సిద్ధ్యసిద్ధి రూపముగా జెప్పబడుటచే, పురాణకదకును బ్రస్తుతకథకును ఫలసమన్వయము కుదుర్పబడెను. ఇది