పుట:AndhraRachaitaluVol1.djvu/270

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఉ. గాలియు నాకులుం దినుచు గానలలో దపమున్న దాని కీ

మేలనుకోకు మట్టివె సుమీ చిలువల్ వృషభంబు వాని కీ

జాలెనె ; ప్రేమచేత జుమి సామెయి నీకిదె భర్గుడంచు స్వ

స్త్రీలు నుతింపగా నలరు శీతగిరీంద్రకుమారి నెన్నెదన్.

ఈ 'రాజతరంగణి'యేగాక సాహసిక కథార్ణవము, అపవాదతరంగిణి, ప్రభువిశ్వాసము మున్నగు పెక్కురచనలు గావించి కవిగా నీప్రభుమణి పేరుగాంచెను. రాజకీయమున గూడ నీయన మంచిపరిశ్రమము చేసి యెన్నో సభలలో నుపన్యాసము లొసగెను. శ్రీకృష్ణారావుగారి రాజభక్తి మెచ్చదగినది. శ్రీజార్జి చక్రవర్తి పట్టాభిషేక సమయమున 1911 లో దెలుగు కవులెందఱచేతనో పద్యములు వ్రాయించి తెప్పించి యా కారొనేషన్‌' సంచిక శ్రీప్రభువువారి కర్పించుకొనిరి. అప్పటి కృతి పద్య మిది యొకటి.

మ. పదుమూడేడుల యీడువచ్చె జదివెన్ భాషాప్రపంచంబు దొ

డ్డది మా బ్రాహ్మవివాహకాల మది దాటంజేయగారాదు, నీ

పదదాస్యం బొనరించు చున్ ముదమునన్ వర్ధిల్లగా నెంచుచు

న్నది జార్జీశ్వర ! మాసరస్వతిని గాన్కం జేతు గైకోగదే?

ఈ విధముగ రాజభక్తుడు, గ్రంథరచనాసక్తుడు, పండితపాలకుడు, ప్రభువరుడునైన శ్రీవేంకట కృష్ణరాయకవి ప్రభువులలో బ్రభువు. పండితులలో బండితుడు. రచయితలలో రచయిత. పాపము! పోలవర సంస్థానకవి తిరుపతి శాస్త్రి 'శ్రీకృష్ణనిర్యాణము' ను గుఱించి యెంతవగచినాడో పరికింపుడు.

సీ. శతవధాన మొనర్ప సరసులు కబురంప

బంపకుండగ మానిపింపలేదు

సర్వదేశంబుల సభలకు బోవుచో

వెంట రమ్మనకుండ విడువలేదు