పుట:AndhraRachaitaluVol1.djvu/248

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చిలకమర్తి లక్ష్మీనరసింహము

1867 - 1946

ఆరామ ద్రావిడశాఖీయులు. కాశ్యపసగోత్రులు. అశ్వలాయన సూత్రులు. తల్లి: రత్నమ్మ. తండ్రి: వెంకయ్య. జన్మస్థానము: ఖండవల్లి. నివాసము: రాజమహేంద్రవరము. జననము: 26-9-1867 సం. (ప్రభవ సం|| భాద్రపద బ|| చతుర్దశి రాత్రి) - నిర్యాణము: 1946 జూన్ 17 వ తేదీ. కవికర్తృగ్రంథములు మొత్తము సంఖ్య 90. రఘుకుల చరిత్ర, స్వప్నవాసవదత్తము, సౌందర్యతిలక, హేమలత, భారతకథా మంజరి, సర్వశాస్త్రార్థ సంగ్రహము, కృష్ణవేణి, సుధాశరచ్చంద్రము, అహల్యాబాయి, ప్రసన్నయాదవ నాటకము, పారిజాతాపహరణము, పార్వతీ నాటకము, మణిమంజరి, సువర్ణగుప్తుడు, నానకుచరిత్ర, నందనచరిత్ర, కర్పూరమంజరి, వినోదములు, వాల్మీకిరామాయణ సంగ్రహము, గయోపాఖ్యానము, గణపతి, ప్రచ్ఛన్న పాండవము, గ్రీకుపురాణ కథలు, మహాపురుషుల జీవితములు, మధ్యమ వ్యాయోగము, వేమనకవి, రామచంద్ర విజయము, రాజా రామ మోహనరాయి, రాజారత్నము, రాజాస్థాన కథావళి, స్వీయచరిత్ర, ఇత్యాదులు.

గయోపాఖ్యానము తెలుగులో బహుజనామోదము బడసిన నాటక రాజము. ఆంధ్రుల కీనాటకముపై నసాధారణాదరము కల దనుట కది నేటికి లక్షపై బాతికవేలప్రతు లమ్ముడు పడియుండుటయే తార్కాణ. రంగస్థలములపై రక్తికట్టునాటకములలో నిది మొట్టమొదటిది. గయోపాఖ్యానము చిలకమర్తి లక్ష్మీనరసింహకవిగారు తమ యిరువది రెండవ యేట రచించిరి. ఈనాటకమే కవిగారిని మహాకీర్తిసంపన్నులను గావించినది. శ్రీకృష్ణుని సందేశముగొని యక్రూరు డర్జునునితో "నీతో ముఖ్యముగా నీబావ చెప్పుమన్న సందేశము వినుము" అని యిట్లు చెప్పెను.