Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గారు వీరి శిష్యరత్నము. ఆంధ్ర విశ్వగుణాదర్శకర్త పంచాంగము తేవప్పెరుమాళ్ళయ్య నూరికడనే పఠించెను.

బ్రౌనుదొర, గాజుల లక్ష్మీనృసింహము సెట్టి, జస్టిస్ రంగనాథశాస్త్రి, కుమారస్వామిశాస్త్రి మున్నగు మహనీయులు నెచ్చెలులై చిన్నయసూరి భాషాసేవకు నిరంతర ప్రోత్సాహ మిచ్చుచుండువారు. తొట్టతొలుత సూరిని గ్రంథ రచనోద్యమములో బెట్టినవాడు లక్ష్మీనృసింహము శ్రేష్ఠి. ఆంధ్రశబ్దశాసనము, ఆంధ్రనిఘంటువు, వీరియెచ్చరిక వలన నూసూరి వ్రాయనారంభించెను. కాని యవి రెండును దుదముట్టలేదు. ఈ నిఘంటువిషయము మిచట గొంత ముచ్చటింపవలసినది కలదు.

చిన్నయసూరి యాంధ్రనిఘంటు రచనోద్యమము నెఱిగిన వారు పెక్కుమంది యుండరు. ఆ యుద్యమము కడముట్టలేదు గాని పదముల పట్టిక వ్రాసికొని, యర్థనిర్ణయమునకు గావలిసిన ప్రాచీన మహాకవి ప్రయుక్త వాక్యములనెత్తి, కొన్నింటి కర్థనిర్ణయము చేసి సూరి చాల బరిశ్రమనకు బాలుపడి దైవ దుర్వపాకమున రాచపుండు బయలుదేఱి, 1862 లో బ్రాణములు గోలుపోయెను. ఆచార్య మరణానంతరము వారియాప్తశిష్యులు బహుజనపల్లి సీతారామాచార్యులుగారు సూరి గారి కోడలికడనున్న నిఘంటు సామాగ్రిని కారణాంతరము చెప్పి పుచ్చుకొని యంతయు సంగ్రహించి వ్రాసికొని మరల నది యామెకిచ్చివేసిరని యొక వదంతి. ఈ వదంతిలోని యౌగాములు నిర్ధారింపజాలము. కాని శబ్దరత్నాకరమునకును, అముద్రితమగు చిన్నయసూరి నిఘంటువునకును బెక్కుచోట్ల నక్కాసెల్లెండ్ర పోలికలు కలవు. శ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారి కిది యెటులో లభించినటులు, ఆయనకడ వీరేశలింగము పంతులుగారు బిలిచికొని, సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాలయము వారికి, అనగా ఆంధ్ర సాహిత్యపరిషత్కార్యాలయమునకు వెలకో, ఊరకో యిచ్చియుందురని విన్న సంగతి. ఏమైనను, తన్నిఘంటు కార్యాలయ పండితులు ప్రామాణికముగా నీవ్రాతకాకితములు చూచు