చెన్నపుర రాష్ట్రీయ కళాశాలలో సూరి ప్రధానాంధ్రోపాధ్యాయుడై యుండెను. మొట్టమొదట నాంధ్ర మహాభాగవతము నెలువరించిన పండితవరులు పురాణము హయగ్రీవశాస్త్రి గారు నాడు ద్వితీయాంధ్రోపాధ్యాయులుగా నుండిరి. వీరిర్వురును సహపాఠులు. నాడు విశ్వవిద్యాలయ కార్యదర్శి ఎ.జె. ఆర్బత్ నట్ దొర కాశినుండి తర్క మీమాంసా పండితుల రావించి చిన్నయను బరీక్షచేయించి సమర్థుడని యెఱిగి చిన్నయసూఱి యను నక్షరములతో స్వర్ణకంకణము నొండు 'సీమ' నుండి తెప్పించి బహుమానించెను. నాడు మొదలు చిన్నయ చిన్నయసూరి.
ఆ కాలమున మదరాసులో న్యాయమూర్తి శ్రీరంగనాథశాస్త్రి పదునైదు భాషలలో బ్రవేశము గల పెద్దన్యాయాధిపతి.
ఆయనకు హయగ్రీవశాస్త్రిగారిపై నభిమాన మధికము. ఆ కారణమున నాయనతో "సూరిగారి ప్రథమోపాధ్యాయ పదవి మీకు వచ్చునట్లు చేసెద" నని రెండుమూడుసారులు చెప్పుచు వచ్చిరట. అంతట హయగ్రీవ శాస్త్రిగారు "ప్రధానోపాధ్యాయస్థానమునకు సూరిగారే సమర్ధులు" అని చెప్పి రంగనాథశాస్త్రిగారికి సూరి ప్రతిభ చూపించనెంచి యొక యాదివారమున వారిని సూరి యింటికి గొంపోయిరట. రంగనాథ శాస్త్రిగారి కోరికపై జిన్నయసూరి యలంకారవిషయము ముచ్చటించుట కారంభించెను. ఆ మహోపన్యాస మట్లు గంగాప్రవాహమువలె బోవుచునే యున్నది. రంగనాథ శాస్త్రిగా రేకతానులై చెవులొగ్గి వినుచుండెను. హయగ్రీవశాస్త్రి తమసహపాఠి శక్తి కానందభరితుడగుచుండెను. రాత్రి పదిగంటలయినది. అప్పుడు న్యాయాధిపతికి మెలకువ వచ్చి సూరి శాస్త్ర జ్ఞానమునకాశ్చర్యపడి, పూర్వాభిప్రాయము తొలగించుకొని సెలవుగైకొని యింటికి బోయెను.
సూరిగారికి బేరుపొందిన శిష్యులెందఱో కలరు. శబ్దరత్నాకర కర్తలు, ప్రౌఢవ్యాకర్తలునైన బహుజనపల్లి సీతారామాచార్యులు