పుట:AndhraRachaitaluVol1.djvu/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లను గూర్చి యెక్కువ చర్చింతురు. పంతులుగారికి దేశభాషయందింతింత యనరాని యభిమానము. దేశీయభాషలో నుపన్యసింపలేని యధ్యక్షునిగూర్చి పంతులుగారు ప్రకటించిన యాగ్రహ మనుపమానము. ఇది 'స్వభాష' యను (సాక్షి మూడవసంపుటము) వ్యాసమున గాననగును. స్నానసంధ్యాదినియమములు వదలివేయుట భారతీయులకు ధర్మము కాదని చెప్పు ప్రాచీనాచారపరాయణులు శ్రీ పంతులుగారు. వారివేదాంతోపన్యాసములను బట్టిచూచిన వారద్వైతవాదులు. కాని వస్తుత: వీరు ద్వైతమతస్థులు. నేటి విద్యావిధానమున దైవభక్తికి సంబంధించినగ్రంథములు లేవనియు గనుకనే విద్యార్థులలో నాస్తికత ప్రబలుచున్న దనియు వీరు పలుమారు వ్రాయుచుందురు. రాజకీయ విషయములనుగూర్చి యెన్నికలనుగూర్చి వ్రాయుచు గాంధిగారి సిద్ధాంతములను దాము వివేకించునట్లు విలిఖించిరి. సాక్షిలో 'తోలుబొమ్మలాట' వ్యాసము చదివిన వీరి జానపదవిషయవివేకత వెల్లడియగును.


పానుగంటిపంతులుగారు శబ్దవైచిత్రవలచినకవి. ఆంధ్రవచనరచనలో వీరొకక్రొత్తదారి త్రొక్కిరి. కందుకూరి వీరేశలింగము పంతులుగారు గద్యతిక్కనయేగాని యావిషయము వేఱు. చిలకమర్తికవి పెద్దనవలా రచయితేగాని యదియునువేఱే. పానుగంటివారి రచన మఱియొక విలక్షణమైనది. వీరు వ్యావహారికమునకు దగ్గఱగనుండు గ్రాంథికము వ్రాయుదురు. ప్రతిపదము పరిహాసగర్భితము. ఆక్షేపణ భరితము. చెప్పినదే మార్చి మార్చి భంగ్యంతరముగా జెప్పుట వీరి రచనలో గ్రత్తదనము. చదివినకొలదిని జదువుట కుత్సాహము పుట్టించు రచనమే రచనము. అది పానుగంటికవి సొమ్ము. విషయము గప్పిపుచ్చకుండ, విసుగుపుట్టింపకుండ వేలకొలది నిదర్శనముల జూపుచు వ్రాయుటలో బానుగంటి వారిదే పై చెయ్యి. పాఠకున కొకవిధమైన యుత్సాహము చిత్తసంస్కృతి యావేశము గలిగింపజేయుట కీయన రచన యక్కటైనది.