మంగళంపల్లి సర్వేశ్వరశాస్త్రి, బులుసుపాపయ్యశాస్త్రి మాటలలో ధ్వను లుపయోగించెడివారట. "అర్క శుష్క ఫలకోమల స్తనీ, పెద్ది భొట్టుగృహిణీ విరాజతే" ఇత్యాది మహావాక్యములకు గర్తలగు పెద్దిభొట్టుగారు చాటూక్తి చతురుడని ప్రసిద్ధి. ఇటీవలి చిలకమర్తికవి, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, వేదము వేంకట్రాయశాస్త్రి చతురభాషణులలో బేరుమోసినవారు. వీరివాకులు కొన్ని లోకులు చెప్పుకొని యానందించు చుందురు. సాంఖ్యాయనశర్మగారిసంభాషణముకూడ దేశప్రసిద్ధమైనది. వీరిది పండితైక రంజకమైన వక్తృత్వమేగాదు. ప్రజాసామాన్యమునకు సుబోధమగు మాటనేర్పు. పైని మన మనుకొనిన వారందఱును బండితపామరమనోరంజకముగా మాటాడువారే.
సాంఖ్యాయనశర్మగారు కవిత్వము వ్రాసెను. చిత్రలేఖనము నేర్చెను. సంగీతము నెఱిగెను. నాట్యశాస్త్రము తెలిసికొనెను. పదార్థవిజ్ఞాన రసాయన శాస్త్రములు, భూవృక్ష క్రిమికీటక ఖనిజతత్త్వము, ప్రాచీనాధునాతన హైందవరాజ్యాంగ విశేషములు చక్కగా బరిశీలించెను. వీరి ప్రజ్ఞాదర్పణమున బ్రతిఫలింపనికళ లేదు. కుశాగ్రబుద్ధియగుటచే సంస్కృతాంధ్రములలో జిన్ననాటనే గొప్పసాహిత్య మలవఱచుకొనెను.
క్రీ.శ. 1880 ప్రాంతమున దెలుగు దేశమున వ్యాప్తములోనున్న ఆంధ్రభాషాసంజీవిని (కొక్కొండ వెంకటరత్నముగారిచే బ్రకటితము), మందారమంజిరి, ప్రబంధకల్పవల్లి మున్నగుపత్రికలు చదువుచుండుటచే సాంఖ్యాయనశర్మగారికి బత్రికా ప్రచురణోత్సాహము చిన్న తనముననే కలిగినది. నాటికాయన వయస్సు పదునెనిమిదియేండ్లకు లోబడి యుండును. అప్పుడు 'సుజనప్రమోదిని' యను పేరితో నొకమాసపత్రిక నడుపనారంభించిరి. దాని తొలిసంచిక 10-6-1881 సం. నాడు వెలువడినది. 'సుజనప్రమోదిని' తో శర్మగారి నాంధ్ర దేశము కొంచెము గుర్తించినది. 1885 లో శతఘంటకవిత్వము చెప్పిరట. ఆపద్యము