పుట:AndhraRachaitaluVol1.djvu/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆచంట వేంకటరాయ సాంఖ్యాయన శర్మ

1864 - 1933

ఆరువేల నియోగిశాఖాబ్రాహ్మణులు. సాంఖ్యాయనసగోత్రులు. తండ్రి బాపిరాజు. తల్లి నరసాంబ. జననము 1864. నిర్యాణము 1933. వీరి పూర్వులు గోదావరీ మండలములోని ఆచంట గ్రామమున గాపురముండెడివారు. సాంఖ్యాయనశర్మగారి తల్లిదండ్రులు నాగావళీ నదీ ప్రాంతములకు వెడలివచ్చిరి. కాగా వీరు విశాఖపట్టణ మండల నివాసులు. గ్రంథములు: సుధానిధి (కావ్యము), మనోరమ (కావ్యము), పార్థపరాజయము, అవదాతకలభకము (స్వతంత్రనాటకములు) విక్రమోర్వశీయము, ఉత్తరరామచరిత్ర (ఆంధ్రీకరణములు), రహస్య దర్పణము, ఆంధ్ర పద్యావళి మున్నగునవి. ప్రచురించిన పత్రికలు: సుజనప్రమోదిని, కల్పలత.

వేంకటరాయ సాంఖ్యాయన శర్మగారు మహోపాధ్యాయులని ఆంధ్రభీష్ములని కొనియాడబడిన ప్రసిద్ధపండితులు. వీరు పండితులుగాను, కవులుగాను, ప్రతికాసంపాదకులుగాను, విమర్శకులుగాను, మహోపన్యాసకులుగాను తెలుగునాట బేరు సంపాదించిరి. సాంఖ్యాయన శర్మగారు స్పుద్రూపి. ఆకారమున కనుగుణమగుప్రజ్ఞ. ప్రజ్ఞకు దగిన వాక్చాతుర్యము. ఈయన యుపన్యాసవేదిక కెక్కినచో నెట్టివాడైన కిక్కురుమనుటకు వీలులేదు. సమయస్ఫురణము, పరేంగితజ్ఞతయు గల యుపన్యాసకులలో నీయనయగ్రేసరుడు. సమయోచితము సరసమునగు హాస్యము వీరిమాటలలో నుండి యెదుటి వారిని ముగ్ధులనొనరించెను. సాంఖ్యాయశర్మగారి వాక్ స్థానమున నే యున్న తగ్రహము లున్నవో గాని యీయన యతయందముగా బొందికగా మాటాడువారు. సరస సంభాషణమునకు గూడ గొప్ప ప్రతిభ యుండవలయును. మహామహోపాధ్యాయులు పరవస్తు వేంకటరంగాచార్యులు, కొక్కొండ వేంకటరత్నంపంతులు మనోహరముగా భాషించువారని విందుము.