పుట:AndhraRachaitaluVol1.djvu/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కూడ దీని ననువదించినటుల తెలియును. అదికూడ నచ్చు పడినచో నాంధ్రీకృత ప్రకటిత దేవీభాగవతముల సంఖ్య నాలుగు.

శ్రీరామకవిగారు తల్లిదండ్రుల కేకైకపుత్రులు. ఆకారణమున జిన్ననాటినుండియు గడు గారబముగా బెరిగిరి. కృష్ణామండలములోని "అల్లూరు" వీరి పూర్వులకు బూర్వప్రభువు లొసంగిరి. అందుచే వీరిజీవనమునకు లోటులేదు. తొలుత వీరిని బందరు నోబులు పాఠశాలకు జదువునకు బంపించిరి. అచ్చట నాంగ్లము , పారశీకము చదువుచు బదిమాసములు గడపిరి. ఈకవివరుని కుశాగ్రమతికి నివ్వెఱపడి నోబిలుదొర తనయింటికి నడుమనడుమ దీసికొనిపోవుచు నితనికి బుస్తకములిచ్చి ఫలాహారములు పెట్టుచుండెడివాడట. ఇది యెఱిగి శ్రీరామపండితుని తల్లిదండ్రులు క్రైస్తవమతవాసన వీని కెక్కడ గలుగునో యని యాచదువునకు స్వస్తిచెప్పించి యింటికి గొనిపోయిరట.

క్రమముగా బండితసాహాయ్యమున గొంతసంస్కృతాంధ్రజ్ఞానము నాకళించి కవిత నెల్ల నారంభించినా డీయన. 12 వ యేట వ్రాసినను వీరి సోమలింగేశ్వరశతకము ప్రౌడముగానున్నది. ఆకాలమున శతావధానప్రదర్శనమున బ్రసిద్ధినందిన మాడభూషి వేంకటాచార్యులవారు నూజవీడున సంస్థాన విద్వాంసులుగా నుండిరి. ఈయన పేరుబ్రతిష్ఠలు శ్రీరామకవిగారు తఱచు వినుచుండెడివారు. వీరికిని శతావధానము చేయవలె నని సంకల్పము ప్రబలినది. సంస్కృత విద్యాభ్యాసము గావింపవలె నని జిజ్ఞాసయు హెచ్చినది. ఒకనాటి తెల్లవాఱుజామున దల్లిదండ్రు లెఱుగకుండ నూజవీటికి బయనమయి వేంకటాచార్యులవారిని సందర్శించి వారియాదరమున నొక యవధానము గావించెను. అప్పుడాయన యీ కవికిశోరుని కవితాధారకు, మతినై శిత్యమునకు మెచ్చి "పది రెండేడుల యీడునం గవిత జెప్పంజొచ్చి వ్యస్తాక్షరీ" ఇత్యాది పద్యముతో బ్రశంసించెను. వారికడ గొంతసంస్కృతభాషాజ్ఞానము