పుట:AndhraRachaitaluVol1.djvu/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మ. ఒక గీర్వాణపుశ్లోకముం దెనుగుగానూహించి పద్యంబు పొం

దికతో జెప్ప బ్రయానమౌ, నయిన దీనింగల్పనాలంక్రియా

దికముల్ వర్తిలుచున్న వన్నియును బూర్తింగల్గున ట్లెల్లవా

రికి సర్థంబగునట్లు నే సులభమౌరీతిం దెనింగించెదన్.

ప. అని యంగీకరించి పీఠికాపుర సమీపస్థితి చేబ్రోలు గ్రామంబున నివసింపుచు శాలివాహనశకంబునందు వేయు నెనిమిది నూఱుల పదుమూడు వత్సరంబులు గడుప సడరు నందనసంవత్సర శ్రావణ శుద్ధ సప్తమీదినంబున నేతత్ప్రబంధంబు దెనిగింప నారంభించితి......

అనగా, నీభారతచంపువు క్రీస్తుశకము 1891 లో నుపక్రమించి రని తెలియును. రచన కెన్నాళ్ళు పట్టినదోగాని, అచ్చుపడుటమాత్రము 1913 లో జరిగినది. సంస్కృతములో ననంతభట్ట మహాకవి కవిత్వము చాల మాధుర్యముగలది. ఆ మాధుర్యమునకు వెలితిరాకుండ దెలుగులో రంగశాయికవి మిక్కిలిసొంపుగ దీనిని రచించెను. రెండు మచ్చు పద్యములు:

మ. ఘనరత్నోజ్జ్వల కుండలాడ్య ధరయుక్తంబౌ సమస్తాంగ శో

భన కర్ణత్రితయంబు మ్రోల నిరుగ్రేవల్‌పూను దుర్యోధనుం

డు నిజాకారగులైన తొంబదిపయిం దొమ్మండు సోదర్యులుం

దనువేష్టింపగ వచ్చె సైన్యపటహధ్వానావృతాకాశులై.

ఉ. పిమ్మట నెల్ల చోట్ల బడవేసినపువ్వుల సౌరభంబులం

గ్రమ్మినదై స్వస త్పటహరాజియునై యగరూత్థధూపవా

హమ్మగు చందువల్ గలదియై మణిమంచిని విష్టరా ట్కదం

బమ్మును నౌ స్వయంవరపు మంటపమెక్కిరి పాండునందనుల్. [ద్వితీయ స్తబకము 86.87]

వీరి చిత్రకవిత్వమున కుదాహరణముగ నీపద్య మొకటి పైగ్రంథములోనిదే చూపుచున్నాడను.