పుట:AndhraKavulaCharitamuVol2.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మోహనాంగి యనునామాంతర ముండిన నుండియుండవచ్చును. ఆచిన్నది యొక్కనాడు తండ్రితో చతురంగ మాడుచు, తనబలములోని బం టొకటి మంత్రియొక్కయు, నేనుగుయొక్కయు పగచేత తొలగవలసి వచ్చినప్పుడు "ఉద్ధతుల మధ్యమున బేద కుండదరమె" యని చదివెనట! అదివిని రాజు పద్యమంతయు జదువుమని పుత్రినడుగగా నామె కవికర్ణరసాయనములోని మూడవయాశ్వాసమునందలి యీపద్యము నిట్లు చదివెనట:-


గీ. ఒత్తుకొనివచ్చుకటికుచోద్వృత్తి జూచి

తరుణితనుమధ్య మెచటికో తలగిపోయె

నుండె నేనియు గనబడ కున్నె యహహ!

యుద్ధతులమధ్యమున బేద కుండ దరమె?


అప్పుడు రాజాపద్యముయొక్క చమత్కృతి కానందించి యెక్కడి దని యడిగి తెలిసికొని పెద్దన్నచేసినమోసము నెఱిగి ఖేదపడెనట!

రాజసంస్థానమునందు దనకు గలిగినయనాదరణచేత కుపితుడయియే నృసింహకవి తనమాంధాతృచరిత్రమునం దీక్రింది రాజదూషణ పద్యమును జొప్పించెనని చెప్పుదురు-


సీ. ఆందోళికలయందు నంతరచరు లైనసవికృతాకృతులపిశాచజనులు

పరకరాళంబులై ప్రార్థింప గనుగోక వాయెత్తకుండుజీవచ్ఛవములు

వాలవీజనముల గ్రాలుచు నీగకు నంటీనిఖరవర్తులాండసములు

వేత్రపరంపరావిలకంటకావృతి జేర బోరానిబర్బూరతరులు

శంఖనాగస్వరస్వరశ్రవణసమద

విస్ఫుటచ్ఛత్రవిస్ఫారితస్ఫటాక

విష్టవిష వైద్యవశవర్తి దుష్టఫణులు

ప్రభుదురాత్ముల నెవ్వాడు ప్రస్తుతించు.