పుట:AndhraKavulaCharitamuVol2.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. సంకుపాల నృసింహకవి

ఇతడు కవికర్ణరసాయన మను మాంధాతృచరిత్రమును రచియించిన మహాకవి. ఈ కవి కృష్ణదేవరాయనికాలమునం దుండె ననుటనుగూర్చి యొకకథ గలదు. దానినిచ్చట సంక్షేపించి చెప్పుచున్నాను. పెద్దన్న మనుచరిత్రమును రచించినతరువాత నృసింహకవి కష్టపడి కవికర్ణరసాయనమును జేసి, దానిని కృష్ణదేవరాయని కంకితము చేయదలచి, విజయనగరమునకువచ్చి తదాస్థానకవియైన పెద్దన్నను దర్శించి, తనగ్రంథము నామూలాగ్రముగా నాతనికి వినిపించి, రాజదర్శనము చేయింపవలెనని వేడెనట! ఆంధ్రకవితాపితామహు డాగ్రంథచమత్కారమున కద్భుతపడి, అట్టిగ్రంథమునకు రాజునకు జూపినయెడల దన మనుచరిత్రముమీది గౌరవము తగ్గుననియెంచి, ఈర్ష్యచేత నాతనికి రాజదర్శనము కానియ్యక "యిదిగో, అదిగో" అనిచిరకాలము గడపి యూరక పంపివేసెనట! అతడు రాజాస్థానమున లాభప్రాప్తి లేకపోగా మీదు మిక్కిలి తనవెంట దెచ్చుకొన్న కాసువీసములను సహితము వ్యయపెట్టుకొని, దినభుక్తి జరగక తనపుస్తకములోని కొన్నిపద్యములను విక్రయింపవలసినవా డయి, తుదకు విసిగి రాజులను దూషించుచు లేచిపోయి తనగ్రంథమును శ్రీరంగనాథున కంకితముచేసి కృతార్థుడయ్యెనట! అప్పుడు విక్రయింపబడిన పద్యములలో నొకటి రెండెట్లో కృష్ణదేవరాయల కూతురైన మోహనాంగిచేతిలో బడెనట! కృష్ణరాయనికి మహావిదుషియైన మోహనాంగి యనుకూతురు గలదనియు, ఆమె యనుపమానసాహిత్యము కలదయి మారీచిపరిణయ మనుశృంగారప్రబంధమును రచియించె ననియు, రామరాజభార్యయనియు కొందఱు వ్రాసియున్నారు. ఆగ్రంథము నాకు లభించినది కాదు. రామరాజు భార్యపేరు తిరుమలాంబ. అయినను తిరుమలాంబకు